ఆర్టీసీ సిబ్బందిపై దాడులు ఆపకపోతే విధుల బహిష్కరణ : ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరిక

by Muthe.Rajitha |

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇదే విధంగా దాడులు కొనసాగితే ఎక్కడి బస్సులు అక్కడే ఆపి విధులను బహిష్కరిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, ఈదురు వెంకన్న స్పష్టం చేశారు.

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు ఆపకపోతే విధుల బహిష్కరణ : ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇదే విధంగా దాడులు కొనసాగితే ఎక్కడి బస్సులు అక్కడే ఆపి విధులను బహిష్కరిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. ఇటీవల సిరిసిల్లలో డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన మరవకముందే, నవంబర్ 24న హకీంపేట డిపో సిబ్బంది, వారిని ఆపేందుకు వచ్చిన ప్రయాణీకులపై దుండగులు అమానుషంగా దాడి చేశారని యూనియన్ నేతలు తెలిపారు.

దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గతంలో ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన కండక్టర్ యు. రమేష్‌పై విధుల్లో ఉన్నప్పుడే దాడి జరగడంతో ప్రస్తుతం నడవలేని స్థితికి చేరుకోవాల్సి వచ్చిందని, రెండు సంవత్సరాలుగా అతడు సాధారణ కండక్టర్ విధులు చేయలేని నేపథ్యంలో ఓడీ డ్యూటీ ఇచ్చేయాలని ఎన్నిసార్లు బస్‌భవన్ చుట్టూ తిరిగినా యాజమాన్యం కనికరం చూపలేదని ఆక్షేపించారు. జీవనోపాధి కోల్పోయి ఆ కుటుంబం తీవ్రమైన ఇబ్బందులు పడుతోందని చెప్పారు.

అలాగే చౌటుప్పల్–యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఒక డ్రైవర్‌ను “ఆపమన్న చోట ఆపలేదని” ఒక మహిళ ప్రయాణీకురాలు ఫిర్యాదు చేయగా, ఆమె భర్త, కుమారుడు వచ్చి విచక్షణారహితంగా కొట్టి బూతులు తిట్టిన ఘటనను కూడా యూనియన్ నేతలు ప్రస్తావించారు. కానీ దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. హయత్‌నగర్ డిపో డ్రైవర్ మెడపై మహిళ కొట్టడంతో ఎముకలు దెబ్బతిని మెడికల్ అన్‌ఫిట్ అయ్యాడని, ఆ కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు.

మరోవైపు ఎదురుగా వచ్చే వాహనాల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర గాయాలు పొందినా, వారికి మానవతా ధోరణితో ఇతర డ్యూటీలు ఇచ్చే బదులు యాజమాన్యం రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పిస్తోందని యూనియన్ తీవ్ర విమర్శలు చేసింది. విధి నిర్వహణలో దాడులకు గురైనవారికి, ప్రమాదాల్లో గాయపడినవారికి అవుట్‌ఆఫ్‌ డిజిగ్నేషన్ డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా గమనించి, వారికి తగిన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, దాడి ఘటనలను వెంటనే పోలీసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని యూనియన్ కోరింది. ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఇప్పటికే లేఖలు సమర్పించినట్లు ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు.

Next Story