- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: సమ్మె విరమించిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు
ట్రాన్స్కో సీఎండీతో ఆర్టిజన్ల సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్కో సీఎండీతో ఆర్టిజన్ల సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ప్రజా భవన్ లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు. రెగ్యులరైజేషన్, విద్యార్హత ఆధారంగా ప్రమోషన్లు, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ నిబంధనల వర్తింపు, డిస్కంలలో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా తీసుకోవడం, పీఆర్సీ అమలుతో పాటు, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలన్న డిమాండ్లతో ఆర్టిజన్లు ఈ నెల 8వ తేదీ నుంచి 10 రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. అయితే ఆర్థికపరమైన భారం లేకుండా మిగతా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని డిఫ్యూటీ సీఎం హామీ ఇచ్చినట్లు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ ఎస్. సాయిలు, కో చైర్మన్ ఎస్. శ్రీధర్ గౌడ్ తెలిపారు. విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల సంఘాలు తమకు పెద్దగా సహకరించలేదని ఆర్టిజన్ల జేఏసీ నాయకులు వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల అధికారులు తమ ఆర్టిజన్లను సమ్మె విరమించుకోవాలని భయభ్రాంతులకు గురిచేశారని... అయినా 10 రోజుల పాటు ఆర్టిజన్లంతా ఒక్క మాటపై ఉండి తమ సమస్యల పోరాటం కోసం మొక్కవోని ధైర్యంతో సమ్మెకు దిగడం తమ ఐక్యతకు నిదర్శనంగా జేఏసీ పేర్కొంది. మరోవైపు ఆర్టిజన్ల సమస్యలపై చర్చించేందుకు ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్ తో ఆర్టిజన్ల నాయకులు చర్చలు జరుపనున్నారు. కాగా... ఆర్టిజన్ల సమ్మె విరమణ కోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చొరవ తీసుకున్నారని... ఆయన ప్రయత్నం వల్లే తాము డిఫ్యూటీ సీఎం వద్ద చర్చించి సమ్మె విరమించినట్లు ఆర్టిజన్ జేఏసీ నాయకులు తెలిపారు. కాగా... రాష్ట్రంలో వేసవితాపం అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్టిజన్లు సమ్మె విరమించి విధుల్లోకి చేరడంతో విద్యుత్ కోతల సమస్యలపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని కోరిన ఆర్టిజన్ల విజ్ఞప్తిని వచ్చే నెలలో పరిశీలిస్తామని డిఫ్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు.
ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రయత్నిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
సమ్మెపై బ్యాన్ ఉన్నదని తెలిసి, వేసవిలో విద్యుత్తు డిమాండ్ పీక్ స్థాయిలో ఉన్న ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు చేస్తుందని... వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని జేఏసీ నాయకులకు డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్కో సిఎండి చర్చలు జరిపి... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. చర్చల్లో ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






