రాష్ట్రంలో 8వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె..

by Kema Shiva Kumar |

తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె ఉధృతం అవుతోంది. ఏప్రిల్ 16 ఉదయం 11 గంటల లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని టీజీ ట్రాన్స్‌కో హెచ్చరికలు జారీ చేసింది

రాష్ట్రంలో 8వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు ఈ నెల 8వ తేదీ నుంచి చేపట్టిన సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) కింద విద్యుత్ సేవలను అత్యవసర సేవలుగా ప్రకటించి, సమ్మెలను నిషేధించింది. అయినా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ (టీవీఏఈ-జేఏసీ) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమ్మెపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఉత్తర, దక్షిణ డిస్కంలు, జెన్ కో, ట్రాన్స్ కో నుంచి గానీ చర్చలకు అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదు. సమ్మె ప్రభావం పడకుండా అధికారులు ఇప్పటికే పలు ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టారు. మరోవైపు సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్ సంస్థలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా బుధవారం టీజీ ట్రాన్స్‌కో... సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్లపై కఠిన వైఖరి అవలంభించింది. వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే సేవల నుంచి తొలగింపునకు గురవుతారని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ సమ్మెలో పాల్గొనడం చట్ట విరుద్ధమని టీజీ ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 16, ఉదయం 11 గంటల లోపు సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్లు విధుల్లో చేరేందుకు టీజీ ట్రాన్స్‌కో గడువు విధించింది. ఆ గడువు లోపు విధుల్లో చేరని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని (డీమ్డ్ టెర్మినేషన్) సంస్థ స్పష్టం చేసింది. సమ్మెలో పాల్గొనడం సేవా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యుత్ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాధిపతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో విద్యుత్ సంస్థలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టిజన్లు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు.

ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మె కొనసాగుతుంది..

విద్యుత్ సంస్థలు తమపై ఎన్ని బెదిరింపులకు పాల్పడినా... తమ డిమాండ్లు నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె కొనసాగుతుందని టీవీఏఈ-జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.సాయిలు తెలిపారు. సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నా తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న మొత్తం 19500 మంది ఆర్టిజన్లను తొలగించినా తమ పోరాటం ఆగదన్నారు.

Next Story