- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్నిప్రమాదాలకు చెక్ పెట్టాలంటే నిబంధనలు పాటించాల్సిందే.. : ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
రోజురోజుకూ పెరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టాలంటే విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడకూడదని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ పెరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టాలంటే విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల నిర్వాహకులు, ప్రజలు సమన్వయంతో కృషి చేసినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో విద్యుత్ భద్రత అంశంల పై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన డీజీ విక్రమ్ సింగ్ మాన్.. ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన విద్యుత్ భద్రతపై సురక్షా చిట్కాలు పోస్టర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.
తనిఖీలు మస్ట్..
అనంతరం ఆయన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో అధిక శాతం విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, లోపభూయిష్టమైన వైరింగ్, నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రమాదాలను నివారించాలంటే విద్యుత్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. భవనాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో క్రమం తప్పకుండా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడటం, చట్టబద్ధమైన భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం, సురక్షిత విద్యుత్ వినియోగ పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలమని ఆయన అన్నారు. విద్యుత్ ప్రమాదాల వల్ల సంభవించే అగ్నిప్రమాదాలను తగ్గించేందుకు నివారణ చర్యలను ప్రోత్సహించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.
ఆరు సూత్రాల రోడ్‌మ్యాప్..
ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఏఐ ప్రతినిధులు రూపొందించిన ఆరు సూత్రాల విద్యుత్ భద్రతా రోడ్‌మ్యాప్ పై సదస్సులో చర్చించారు. విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, సాంకేతిక సామర్థ్య పెంపు,నిరంతర భద్రతా తనిఖీలు, నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విద్యుత్ సంబంధిత అగ్నిప్రమాదాలను తగ్గించి, ప్రాణా ఆస్తులను రక్షించేందుకు అగ్ని నివారణ,.భద్రతా అవగాహనపై అన్ని భాగస్వామ్య వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలంగాణ అగ్నిమాపక శాఖ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ఎక్స్-అఫీషియో చైర్‌పర్సన్ కె. నంద కుమార్, ఆర్ అండ్ బీ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లింగారెడ్డి తదితరులు హాజరయ్యారు.






