ఓటరు జాబితా ప్రక్షాళన షురూ.. రాజకీయ పార్టీలతో EC సమావేశం

by Gantepaka Srikanth |
ఓటరు జాబితా ప్రక్షాళన షురూ.. రాజకీయ పార్టీలతో EC సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులను సరిదిద్ది, నకిలీ ఓటర్లను గుర్తించి తొలగిస్తామన్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తామని, ఓటరు నమోదులో యువతను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఓటరు నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకుని, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం, ఓటర్ ఐడీలతో ఆధార్‌ను అనుసంధానం చేయడం, చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం వంటి పలు సూచనలను వారి నుంచి ఆహ్వానించారు. బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎఐఎంఐఎం, ఆప్, సీపీఎం పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.



Next Story

Most Viewed