- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ.. సీతక్క కీలక ప్రకటన
అంగన్ వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడి కేంద్రాల్లో (Angan Wadi) అందిస్తున్న విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో మనమంతా పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. అంగన్వాడీల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారపదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామని వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ (Egg Biryani) వడ్డించేలా మెనూ మార్చబోతున్నట్లు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో మాట్లాడిన సీతక్క..అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడి కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడి టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తామన్నారు.
బడి గంట తరహాలో బెల్స్:
అంగన్ వాడీ కేంద్రాల్లోనూ బడి గంట తరహాలో బెల్సును తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామని ఇలా గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని టీచర్లు, హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. మీ అనుభవాలు, ఆలోచనలు, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరించి, నిపుణులు మేధావులతో చర్చించి అంగన్వాడీల సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. మేము అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ సమ్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా నియామకాల ప్రక్రియ కాస్త ఆలస్యమైందని త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపుకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్లే స్కూల్ లకు దీటుగా అంగన్వాడీలను సిద్ధం చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని అన్నారు. చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు నమ్మకం కలిగించేలా సిబ్బంది పని చేయాలని సూచించారు.
అంగన్వాడీలు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సెల్ఫీ విత్ అంగన్వాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించారు. కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున వయోవృద్ధులకు, ట్రాన్స్ జెండర్ ల ఆత్మగౌరవాన్నీ పెంపొందించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలను ఒకే మోడల్ లో నిర్మించాలని సూచించారు






