మంత్రి కేటీఆర్ పర్యటన ఎఫెక్ట్.. వరంగల్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్ట్!

by Disha Web Desk 2 |
మంత్రి కేటీఆర్ పర్యటన ఎఫెక్ట్.. వరంగల్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్ట్!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో ప‌లు అభివృద్ధి ప‌నులను ప్రారంభించేందుకు శుక్రవారం కేటీఆర్ రానున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ, కుల సంఘాల నేత‌ల‌ను ముంద‌స్తుగా అరెస్టు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే కొంత‌మందిని గృహ‌నిర్బంధంలో ఉంచ‌డం, ముంద‌స్తుగా అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి కేటీఆర్ శుక్రవారం మ‌ధ్యాహ్నం న‌గ‌రానికి చేరుకుని స‌భా అనంత‌రం రాత్రి 9 గంట‌ల త‌ర్వాత ఆయ‌న ప‌ర్యట‌న ముగియ‌నుంది. మంత్రి కేటీఆర్ ప‌ర్యట‌న పూర్తయ్యేంత వ‌ర‌కు బీజేపీ, కాంగ్రెస్‌, కుల‌, విద్యార్థి సంఘాల నేత‌లను నిర్భంధంలోనే ఉంచునున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిని ఆయ‌న‌ నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అలాగే ఏనుమముల పోలీస్ స్టేషన్ పరిధిలోని 3వ డివిజన్ బీజేపీ నాయ‌కుల‌ను గురువారం రాత్రే అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వడ్డేమానుకోట తిరుపతితో పాటు ప‌లువురు నేత‌లున్నారు. వ‌రంగల్ తూర్పులో బీజేపీ నాయ‌కులు మండల భూపాల్, మాచర్ల దీన్ దయాళ్, దుస్సా శివ, ఇనుముల అరుణ్‌లను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ హనుమాన్ దీక్షలో ఉండ‌గా గురువారం అర్ధరాత్రి స‌మ‌యంలో అరెస్టులు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌డికొండ పోలీస్ స్టేష‌న్‌ప‌రిధిలో కాంగ్రెస్ నేత‌ల‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. మాజీ కార్పొరేట‌ర్ తొట్ల రాజుయాద‌వ్‌తో పాటు మ‌రో న‌లుగురు అరెస్టయిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, విద్యార్థి సంఘాల నేత‌ల‌పై నిఘా ఉంచిన పోలీసులు జోరుగా ముంద‌స్తు అరెస్టులు చేప‌డుతున్నారు. ఆందోళ‌న‌లు నిర్వహించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ప్రతీసారి ఇలా అక్రమంగా అరెస్టు చేయ‌డం అన్యాయ‌మ‌ని, త‌మ వ్యక్తిగ‌త స్వేచ్ఛను పోలీసులు హ‌రిస్తున్నార‌ని ప‌లువురు నేత‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

కేటీఆర్ వ‌స్తే అరెస్టులు త‌ప్పవా..?

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు న‌గ‌రానికి వ‌చ్చిన ప్రతీసారి ముంద‌స్తుగా అరెస్టులు కొన‌సాగుతున్నాయి. నిర‌స‌న‌ల‌కు అవ‌కాశం ఉంద‌నే కార‌ణం చూపుతూ పోలీసులు ముంద‌స్తుగా నేత‌ల‌ను అరెస్టు చేస్తున్నారు. నిర‌స‌న తెల‌ప‌డం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న హ‌క్కుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. నిర‌స‌న‌ల‌ను తెల‌ప‌కుండా, ప్రశ్నించే గొంతుక‌ల‌ను నొక్కాల‌ని ప్రభుత్వం చూస్తోంద‌ని మండిప‌డుతున్నారు.

కేటీఆర్ ప‌ర్యట‌న‌కు 144 సెక్షన్ అమ‌లు చేయండి: బీజేపీ అధికార‌ప్రతినిధి రాకేష్ రెడ్డి ధ్వజం

మంత్రి కేటీఆర్ ప‌ర్యటించే జిల్లాల్లో 144 సెక్షన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్రక‌టించండంటూ పోలీస్ అధికారుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మండిప‌డ్డారు. అభివృద్ధి పనులు చేయటానికి వచ్చే మంత్రికి ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు చేయటానికి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు. ఓరుగల్లు అనేక సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ని, ఆ విష‌యాల‌పై ప్రశ్నిస్తే అక్రమాల‌పై అరెస్టు చేస్తారా..? ఇదెక్కడి న్యాయం..? మ‌నం ప్రజాస్వామ్యంలో ఉన్నమా..? నిరంకుశ రాచ‌రిక పాల‌న‌లోనా? అంటూ ధ్వజ‌మెత్తారు.


Next Story

Most Viewed