- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ ప్రగతికి విద్య-మహిళా సాధికారతే కీలకం: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
ప్రపంచ శక్తిగా భారతదేశ ఎదుగుదలకు విద్య, మహిళా సాధికారతే కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ శక్తిగా భారతదేశ ఎదుగుదలకు విద్య, మహిళా సాధికారతే కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. సామాజిక సాధికార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమతా స్కీమ్ కింద ఉచిత విద్యకు ఎంపికైన 375 ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్ ప్రదానోత్సవం కార్యక్రమం మంగళవారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, భారతదేశంలో విద్య, సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులైన దార్శనిక నాయకులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీ.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తీవ్రమైన వివక్షను అధిగమించి ఎదిగిన అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి పాఠం కావాలన్నారు. భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం పంచ తీర్థాన్ని అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. నారీ శక్తి వందన్ చట్టంతో మహిళలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దుద్దిపాల జ్యోతి రెడ్డి మాట్లాడుతూ, తాను ఒక సామాన్య కూలీ స్థాయి నుండి నేటి స్థితికి చేరుకోవడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేసిన పునాదే కారణమని భావోద్వేగంతో తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆదర్శాలతో విశ్వవిద్యాలయం సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 'సమతా స్కీం' అమలు చేస్తూ, డిజిటల్ విద్యా విధానాలను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డా. బండా ప్రకాష్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు విద్యను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న జ్యోతి రెడ్డి ఫౌండేషన్ కృషిని అభినందించారు. ఉన్నత విద్యలో వినూత్న కార్యక్రమాలతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణ రెడ్డి, ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, వివిధ విభాగాల డీన్‌లు, బోధన-బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






