- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన.. సీఎంకు లేఖ
రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన వ్యక్తం చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులను హడావుడిగా అరెస్ట్ చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన వ్యక్తం చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులను హడావుడిగా అరెస్ట్ చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఈజీఐ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్, జనరల్ సెక్రటరీ రాఘవన్ శ్రీనివాసన్ ఆదివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆ న్యూస్ ఛానల్‌లో ప్రసారమైన ఒక గాసిప్ కార్యక్రమంలో, ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి ఒక మంత్రితో సన్నిహిత సంబంధం కారణంగా బదిలీ అయ్యారని పేర్కొన్నారని, అయితే ఆ రిపోర్ట్‌లో ఎలాంటి పేర్లు ప్రస్తావించలేదని గుర్తుచేశారు. దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం సమావేశమై ఎన్టీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో జర్నలిస్టులు, ఎన్టీవీ ఎడిటర్లపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారని తెలిపారు.
అర్ధరాత్రి దాడుల్లో జర్నలిస్టుల అరెస్ట్
అర్ధరాత్రి దాడుల్లో జర్నలిస్టులను అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాక్‌అప్‌లో ఉంచడం కరెక్ట్ కాదన్నారు. అపకీర్తి జరిగిందని భావించిన గుర్తు తెలియని మహిళా అధికారిణి కాకుండా, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని, ఈ సంఘటనలో మీడియా వేదికలను అపకీర్తి కోసం ఉపయోగించడాన్ని గిల్డ్ ఖండిస్తూనే ఉందన్నారు. అయితే, ఎన్టీవీ, జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు అనవసరమైన తొందరపాటు చూపించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు, దాడులు, బెయిలబుల్ నేరాల విషయంలో అనవసరమైనవిగా ఉన్నాయని, అరెస్టుల వంటి బలవంతపు చర్యలకు ముందుగా, పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి, సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉండే అన్నారు. కానీ అధికారం దుర్వినియోగం స్వతంత్ర మీడియాపై భయాందోళన ప్రభావాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పని చేసేలా చూడాలని కోరారు. మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించాలని, సంయమనం వహించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు.






