జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ఆస్తుల జప్తు.. ఈడీ దర్యాప్తు వేగవంతం!

by Ramesh Naini |

సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్–XVIII టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్‌పై నమోదైన అవినీతి ఆస్తుల కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిరాస్తులను పీఎంఎల్‌ఏ కింద తాత్కాలికంగా జప్తు చేసింది.

జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ఆస్తుల జప్తు.. ఈడీ దర్యాప్తు వేగవంతం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్–XVIII టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్‌పై నమోదైన అవినీతి ఆస్తుల కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిరాస్తులను పీఎంఎల్‌ఏ కింద తాత్కాలికంగా జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో స్థలాలు, దుకాణాలు, ప్లాట్లు, నివాస గృహాలు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఈ మేరకు జప్తు వివరాలు ఈడీ శనివారం ప్రకటనలో వెల్లడించింది. ఆస్తులు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలిపింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది.

2022 జూన్‌లో ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలైన ఛార్జిషీట్ ప్రకారం, మహేశ్‌పై ఆదాయ వనరులకు మించి సుమారు రూ.5.27 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలిపింది. ఈడీ దర్యాప్తులో నేర ఆదాయంతో బంధువుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసి, వాటిని చట్టబద్ధమైనవిగా చూపేందుకు బ్యాంకు ఖాతాల్లో భారీ నగదు జమలు చేసినట్లు గుర్తించింది. మహేశ్వరి కన్స్ట్రక్షన్స్ భాగస్వామి కే.బీ. లక్ష్మీనారాయణ సహకారంతో శ్రీ ఇందిరా సదన్ ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు వినియోగించినట్లు ఈడీ వెల్లడించింది. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడి అధికారులు తెలిపారు.

Next Story