ED Raids: సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్లకట్టలు!

by Ramesh Naini |

సురానా, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి.

ED Raids: సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్లకట్టలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సురానా (Surana Industries), (Sai Surya Developers) సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేసినట్లు తెలిసింది. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీ‌శ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టినాగులపల్లి లో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది.

ఇక, సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధుల బదిలీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. కాగా, సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య హైదరాబాద్‌లో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాలలో ఉన్న సురానా గ్రూప్స్ పెద్దఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ రెండు సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించకపోతుండడంతో.. 2012లో సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 400 కేజీల బంగారం సీబీఐ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైందని, ఈ 103 కిలోల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రియల్‌ ఎస్టేట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ సెక్టార్‌లలో సురానా గ్రూప్‌ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది.

Next Story