- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన ఈడీ!
రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణం వెనుక బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణం వెనుక బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని పెద్దలు, అప్పటి మంత్రి తలసాని హస్తం లేకుండా ఇది సాధ్యమేనా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయనకు సంబంధం లేకుండా ఓఎస్డీ కళ్యాణ్ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడుతారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తలసాని ఓఎస్‌డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేయగా కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు, మంత్రికి తెలియకుండా, వారి అండదండలు లేకుండా మంత్రి ఓఎస్డీ రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడుతారా? అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇందులో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉన్నదని, అందువల్లే ఈ కుంభకోణం వెలుగులోకి రాలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాం వెనుకున్న అసలు దోషులను పట్టుకోకుండా ఓఎస్డీ మాత్రమే బాధ్యుడనే తరహాలో వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
త్వరలోనే విచారణకు తలసాని..
ఈ కుంభకోణంలో అసలు దోషులను తప్పించే ప్రయత్నమా? పెద్దలను కాపాడటానికి ఏమైనా తెరవెనక శక్తులు పనిచేస్తున్నాయా? సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ, పార్టీ పెద్దలకు తెలిసి, వారి అండదండలతోనే అప్పటి మంత్రి ద్వారానే ఆయన ఓఎస్డీ ఈ తతంగం నడిపించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆధారాలు కూడా ఈడీకి లభించాయని అంటున్నారు. ఒకవేళ మంత్రికి సంబంధం లేకుండా ఈ స్కాం జరిగితే మంత్రి పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కూడా ఉన్నట్లేనని ప్రశ్నలు సంధిస్తున్నారు. తన ఆఫీసులో ఓఎస్డీ ఇదంతా చేస్తుంటే మంత్రిగా ఉండి తలసాని అప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ విషయంలో రెండు రకాలుగా మంత్రి బాధ్యుడు అవుతాడని, త్వరలోనే ఆయన విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని, తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మొదటి విడతతోనే నిలిచిన స్కీం..
గొర్రెల పంపిణీ పథకం మొదటి విడతతోనే నిలిచిపోయింది. రెండోవిడత ప్రారంభం కాలేదు. రెండో విడత కూడా గొర్రెలను పంపణీ చేసి ఉంటే ఇంకా పెద్ద కుంభకోణం జరిగేదని అనుమానాలు కలుగుతున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన తనిఖీలు, పెట్టిన కేసులు, అరెస్టులను రాజకీయ కక్ష పూరితమైనవిగా కొందరు ఆరోపించారు. కానీ తాజాగా ఈడీ అధికారుల ఎంట్రీ, తనిఖీలతో అందరు ముక్కున వేలు వేసుకుంటున్నారు. రూ.వెయ్యి కోట్ల కుంభకోణమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అన్ని తానై వ్యవహరించిన కళ్యాణ్ప్రత్యక్షంగా ఇరుక్కోగా.. తెరవెనక బాగోతం అంతా తలసానికి తెలిసే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కళ్యాణ్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులకు 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంకు అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లు కలిసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని ఈడీ గుర్తించింది. కళ్యాణ్‌తో పాటుగా వినియోదారులు, మధ్యవర్తి ఇంట్లో ఈడీ సోదాలు చేయగా.. ఇంత పెద్ద కుంభకోణం జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న తలసానికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఈడీ అధికారులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పెద్దలకు నిధులు సమకూర్చే పథకంగా..
గొర్రెల పంపిణీ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభం అవ్వగా.. ఒక యూనిట్‌కు20 గొర్రెలు, ఒక పొట్టెలు.. దీని మొత్తం వ్యయం రూ.1.75 లక్షలు. ఇందులో రూ.45వేలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మాంసం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం అవసరం ఉండకూడదనే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం కాస్తా నాటి పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటుగా బీఆర్ఎస్పెద్దలకు నిధుల సమకూర్చే పథకంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అవి కాస్త పథకం ప్రారంభించిన నాటి నుంచి ఉండగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) తనిఖీలు చేసి రూ. వెయ్యి కోట్ల కుంభకోణం ఇందులో దాగి ఉందని ప్రకటించగా అంతా షాక్ అయ్యారు.
అంతా నకిలీ
గొర్రెల పంపిణీ స్కీంలో రూ.253 కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్ నివేదికలో తేలింది. మ్యూల్, డమ్మీ బ్యాంకు అకౌంట్ల ద్వారానే బెట్టింగ్‌యాప్స్‌కు ఈ డబ్బులను ఉపయోగించినట్లుగా ఆధారాలు లభించాయి. ఏసీబీ అధికారులు గతంలోనే 17 మందిని అరెస్ట్‌చేయగా.. ఆ తరువాత కేసు ముందుకు కదల్లేదు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్కేసు నమోదు చేసి ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్నెంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ట్యాగ్లు, మరణించిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం జరిగిందని తేల్చారు.






