ఆర్బీఐ అనుమతి లేకుండా భారీగా పెట్టుబడులు.. మెటలోయిడ్స్ టెక్నాలజీస్‌పై ఈడీ ప్రాసిక్యూషన్

by Ramesh Naini |

మెటలోయిడ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంటీపీఎస్) సంస్థ ఎండీలు జయంత్ బిశ్వాస్, మౌసుమి బిశ్వాస్‌లపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు తెలిపింది.

ఆర్బీఐ అనుమతి లేకుండా భారీగా పెట్టుబడులు.. మెటలోయిడ్స్ టెక్నాలజీస్‌పై ఈడీ ప్రాసిక్యూషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెటలోయిడ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంటీపీఎస్) సంస్థ ఎండీలు జయంత్ బిశ్వాస్, మౌసుమి బిశ్వాస్‌లపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. దాఖలు చేసిన ఫిర్యాదును జనవరి 28న ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. అధిక వడ్డీ హామీలతో పెట్టుబడిదారులను మోసం చేసినట్లు నమోదైన చీటింగ్ కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.

ఆర్బీఐ అనుమతి లేకుండా 40% నుంచి 200% వరకు రాబడులు ఇస్తామని చెప్పి 4 వేల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి రూ.114.52 కోట్లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నట్లు ఈడి పేర్కొంది. వాటిలో రూ.99.57 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి, మిగిలిన రూ.14.95 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఈడీ వెల్లడించింది. పోంజీ మోడల్‌లో పథకాలు నడిపినట్లు, నిధులను ఇతర వ్యాపారాలు, ఫ్లాట్ల కొనుగోలు, స్థిర డిపాజిట్లకు మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. గతంలో రూ.1.32 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు తెలిపింది. ఈ అంశంపై కేసు విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ ఈడీ కార్యాలయం పేర్కొంది.

Next Story