హీరా గోల్డ్ ఆస్తులను వేలం వేసిన ఈడీ

by Naga Rani Yarlagadda |

అధిక వడ్డీల ఆశ చూపి.. ఎంతోమందిని మోసం చేసిన కేసులో హీరా గోల్డ్ ఆస్తుల్ని ఈడీ హైదరాబాద్ లో వేలం వేసింది.

హీరా గోల్డ్ ఆస్తులను వేలం వేసిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక వడ్డీల ఆశ చూపి.. ఎంతోమందిని మోసం చేసిన కేసులో హీరా గోల్డ్ ఆస్తుల్ని ఈడీ హైదరాబాద్ లో వేలం వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రూ.159 కోట్ల విలువైన 23 ఆస్తుల్ని ఈడీ అధికారులు వేలం వేశారు. సంవత్సరానికి 36 శాతానికి పైగా రాబడి ఇస్తామని హీరా గ్రూప్ పెట్టుబడిదారులను నమ్మించి దేశవ్యాప్తంగా రూ.5,978 కోట్లకు పైగా నిధులు సేకరించింది. నమ్మి పెట్టుబడి పెట్టినవారికి ఒక్కరూపాయి కూడా తిరిగి చెల్లించలేదని ఈడీ గుర్తించి.. విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆపై కోర్టు.. ఆస్తుల్ని వేలం వేయాలని ఆదేశించగా.. MSTC ద్వారా ఈ-వేలం నిర్వహించింది. వేలం ద్వారా వచ్చిన డబ్బును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రత్యేక ఖాతాకు మళ్లించి.. ఆ తర్వాత బాధితులకు పంపిణీ చేసేలా ఈడీ ఏర్పాట్లు చేసింది.

దేశ చరిత్రలోనే అతిపెద్ద పొంజీ స్కాముల్లో ఒకటిగా నిలిచిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ లేదా హలాల్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బంగారం వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఊహించని విధంగా ఏడాదికి 36 - 42 శాతం వరకూ లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఆఫర్ కు ఆశపడి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల నుంచి 1.7 లక్షల మంది బాధితులు పెట్టుబడులు పెట్టారు. అలా దేశమంతా రూ.5,978 కోట్లకు పైగా నిధులను వసూలు చేసిన సంస్థ.. మొదటిలో కొందరికి లాభాలిచ్చి నమ్మించింది. 2018 నాటికి పెట్టుబడిదారులకు అసలు డబ్బు తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. ఈ భారీ మోసం పై కేసు నమోదవ్వగా.. దర్యాప్తు చేసిన ఈడీ.. హీరా గ్రూప్ ఎలాంటి బంగారం వ్యాపారం చేయలేదని తేల్చింది. కొత్త పెట్టుబడిదారులు పెట్టే డబ్బుతో.. పాత పెట్టుబడిదారులకు లాభాలు చెల్లిస్తూ.. మాయచేసినట్లు గుర్తించింది. బినామీల పేరిట దేశవ్యాప్తంగా ఆస్తులు కొన్నట్లు పక్కా ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకూ ఈడీ రూ.400 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది.

Next Story