ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ కీలక నిర్ణయం.. ‘ఏఐ’తో డబుల్ ఓట్ల ఏరివేత!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-29 01:31:30  IST  )

ఎన్నికల విధానంలో పారదర్శకతను పెంచేలా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ కీలక నిర్ణయం.. ‘ఏఐ’తో డబుల్ ఓట్ల ఏరివేత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల విధానంలో పారదర్శకతను పెంచేలా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. మూడు నెలల్లో 18 సంస్కరణలు అమలుచేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడం, పోలింగ్ ను సులభతరం చేయడం, ఓటింగ్ శాతం పెంచే చర్యలు వంటివి ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతేకాకుండా డూప్లికేట్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ సమస్యను పరిష్కరించడానికి యూనిక్ ఐడెంటిఫయర్, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు, ఈ-ఆఫీస్ విధానాలను అమలుచేయాలని నిర్ణయించారు. ఓటర్ స్లిప్ రీడిజైన్ చేయనున్నారు. ఇప్పటికే మూడు వేల మందికి పైగా బూత్ లెవెల్ సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి చేయగా, రాబోయే రోజుల్లో మరో లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

రెండు చోట్ల ఓట్లు లేకుండా..

ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఈసీఐ సిద్ధమైంది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు లేకుండా చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించనున్నది. సొంత రాష్ట్రంతోపాటు సమీప రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉన్న వారి పేర్లను ముందుగా గుర్తించనుంది. అనంతరం వారికి ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటరుగా కొనసాగేలా చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పోలింగ్ స్టేషన్ నుంచి వంద మీటర్ల దూరం వరకు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ మోడ్‌లో మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద సాధారణ బాక్సులు లేదా జనపనార సంచుల్లో ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.

మరణించిన వారి పేర్లు తొలగించేలా..

ఓటరు జాబితాలో మృతి చెందిన వారి పేర్లు కూడా ఉంటున్నాయి. ఈ సమస్య ఎక్కువగా మహా నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంది. దీని ద్వారా కొందరు దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉంటున్నది. మరోవైపు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నది. దీంతో చనిపోయిన వారి పేర్లను ఎప్పటికప్పుడు తొలగించాలని ఈసీఐ నిర్ణయించింది. దీని కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణ డేటాను నేరుగా సేకరించి ఓటరు జాబితాతో అనుసంధానిస్తారు. అనంతరం వారి పేర్లను తొలగిస్తారు.

1,200 మందికి ఒక పోలింగ్ కేంద్రం

గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది వరకు ఓటర్లు ఉండేవారు. దీంతో ఓటర్లు రావడానికి ఇబ్బందులు, ఒకే సారి రావడంతో భారీ క్యూ లైన్లతో ఓటింగ్ శాతం తగ్గుతున్నదని భావించి ఒక్కో పోలింగ్ స్టేషన్‌ పరిధిలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండే విధంగా ఈసీఐ చర్యలు చేపడుతున్నది. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటే ఆ పరిసరాల్లోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటవుతుందని, తక్కువ క్యూ లైన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా దేశ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరగనుంది.

గేటెడ్ కమ్యూనిటీల్లో..

నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, రెసిడెన్షియల్ కాలనీల సంఖ్య పెరిగింది. హైదరాబాదే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ సంస్కృతి వ్యాపించింది. ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఇండ్లు ఉంటున్నాయి. అక్కడ వేల సంఖ్యలో ఓటర్లు ఉంటున్నారు. వారి సౌలభ్యం కోసం గేటెడ్ కమ్యూనిటీ కమిటీ హాళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వారు అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

Next Story