ఎక్స్ అఫీషియో ఓటుపై ఈసీ కీలక ప్రకటన.. మేయర్, చైర్మన్ ఎన్నికలో మారనున్న సమీకరణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 05:13:31  IST  )

మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎంపీలు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు ఉండటం తప్పనిసరి అని SEC స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు మేరకు, మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా వారు అనర్హులని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ఎక్స్ అఫీషియో ఓటుపై ఈసీ కీలక ప్రకటన.. మేయర్, చైర్మన్ ఎన్నికలో మారనున్న సమీకరణలు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ చైర్మన్ (Municipal Chairman), మేయర్ (Meyor) ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల (Ex-Officio Members) ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లోనైనా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే, సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యులర్ కూడా జారీ చేసింది.

హైకోర్టు తీర్పుతో మారుతున్న సమీకరణాలు

గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలోని తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఉండేది. దీనిపై గతంలో హైకోర్టు (High Court)లో వివాదం నడుస్తోంది. దీనిని విచారించిన న్యాయస్థానం.. స్థానిక ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎస్‌ఈసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో హైకోర్టును తీర్పును అమలు చేయాలని బీజేపీ నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇలా..

ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో, అక్కడ వారి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే, వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగడానికి అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు ఏవైనా ఉంటే అవి చెల్లవని ఎస్‌ఈసీ స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

రాజకీయ పార్టీల్లో టెన్షన్..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట ఈ ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. తాజా ఎస్‌ఈసీ (SEC) నిబంధనలతో, స్థానిక ఓటు లేని ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోలేరు. దీంతో అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే అవకాశం ఉంది. హైకోర్టు సీరియస్‌గా ఉండటంతో, అధికారులు ఈ నిబంధనల అమలులో ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Next Story