- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఫస్ట్ టైమ్ ఎస్ఐఆర్.. కసరత్తు ప్రారంభించిన ఈసీ
దేశంలో, రాష్ట్రంలో భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతో ఇండియా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ శ్రీకారం చుట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో, రాష్ట్రంలో భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతో ఇండియా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళనకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ పౌరసత్వం లేకుండా ఓటు హక్కును కలిగి ఉంటే దానిని తొలగించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్‌ను ఎన్నికల సంఘం చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో ఎస్‌ఐఆర్ (ఓటరు జాబితా ప్రక్షాళన)ను చేపట్టారు. దాదాపుగా 23 ఏండ్ల తర్వాత (తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి) మళ్లీ ఈ ప్రక్రియను ఈసీ చేపడుతున్నది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేస్తున్నారు.
‘మ్యాచింగ్.. మ్యాపింగ్’గా నామకరణం
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం కసరత్తు మొదలైంది. బిహార్ తర్వాత ఈ ప్రక్రియ దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు ఈ నెల 10న రాష్ట్రాల ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈవో) లతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో సమావేశమైంది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 19న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఓటరు జాబితా విభజనపై దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా మొదటి విడతలో చేపట్టే కార్యక్రమానికి ‘మ్యాపింగ్... మ్యాచింగ్’ ప్రక్రియగా పేరు పెట్టారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులకు సైతం మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటరు జాబితాను నాలుగు కేటగిరీలుగా విభజించాలని, ప్రక్రియను ఈ నెల 24 కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లా అధికారులు అందులో నిమగ్నమయ్యారు.
ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణలో తొలిసారి చేపడుతున్న ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌పై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అందుకు కారణమైన అంశాలు ఇక్కడ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని ఈసీ ఆదేశించింది.
నాలుగు కేటగిరీలుగా ఓటరు జాబితా విభజన
2002, 2025 ఓటరు జాబితాల ఆధారంగా వాటిని నాలుగు కేటగిరీలుగా విభజించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను ఈ నెల 24లోపు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని సూచించింది. ఈ కేటగిరీల వారిగా విభజించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌కు షెడ్యూల్ విడుదల చేయనుంది. వచ్చే నెలలో షెడ్యూల్విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. డిసెంబర్నాటికి మొత్తం ఓటరు జాబితా ప్రక్షాళన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరిలో మొదటి వారంలోపు తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నందున అక్కడ మాత్రం ఎస్‌ఐఆర్‌ను చేపట్టబోరని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉప ఎన్నిక పూర్తి అయ్యాక దానికి ప్రత్యేక షెడ్యూల్‌తో ఎస్ఐఆర్ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ప్రక్రియలో బూత్ లెవల్ఆఫీసర్(బీఎల్వో)లు కీలకం కావడంతో వారికి ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
నాలుగు కేటగిరీలుగా ఓటరు జాబితా విభజన
మొదటి కేటగిరి : 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు
రెండో కేటగిరి : 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు
మూడో కేటగిరి : 2002 ఓటరు జాబితాలో లేని వారు, 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు
నాలుగో కేటగిరి : 2004 తరువాత జన్మించిన వారు






