లోన్లు తీసుకున్నవారికి షాక్.. పెరగనున్న వడ్డీరేట్లు?

by Naga Rani Yarlagadda |

పశ్చిమాసియా యుద్ధం ఓవైపు.. మరోవైపు కరువు భయాల నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే RBI వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసింది.

లోన్లు తీసుకున్నవారికి షాక్.. పెరగనున్న వడ్డీరేట్లు?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా యుద్ధం ఓవైపు.. మరోవైపు కరువు భయాల నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే RBI వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసింది. దీంతో లోన్లు తీసుకున్న వారిపై వడ్డీ భారం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపోరేటు 5.25 శాతం ఉండగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో వడ్డీరేట్లు 50-75 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని నివేదికలో పేర్కొంది.

ద్రవ్యోల్బణంపై కూడా నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం 5.0కి చేరుకునే ప్రమాదం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ తన నివేదికలో పేర్కొంది. ఆహారం, ఇంధనం మినహా.. కోర్ ద్రవ్యోల్బణం 4.6 గా నమోదు కావొచ్చని అంచనా వేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న రుతుపవనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే 16 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెలలో 3.48 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ.. మే నెలకు 3.94 శాతానికి పెరిగిందని, ఇది ముందు అంచనా వేసిన 4.05 శాతానికి తక్కువైనప్పటికీ.. మార్కెట్లో మాత్రం ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిసరుకు ఖర్చులు, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

రుతుపవనాల కొరతతో పంటలకు ముప్పు

మరోవైపు, ఈ ఏడాది రుతుపవనాలు దీర్ఘకాలిక సగటు (LPA) కంటే 10 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచేలా చేస్తోంది. వర్షాధార పంటలైన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిపై ఈ ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే, నీటి పారుదల సౌకర్యాలు మరియు తగినంత నిల్వలు ఉండటం వల్ల వరి, గోధుమ వంటి ప్రధాన ధాన్యాలకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది. దేశంలో గత ఐదు నెలలుగా తగ్గుతూ వచ్చిన కూరగాయల ధరలు మే నెలలో ఒక్కసారిగా పెరిగాయి. తీవ్రమైన ఎండల కారణంగా మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్ట స్థాయి అయిన 5.7 శాతానికి చేరింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో టమాటాల ధరలు 26 శాతం, క్యాలీఫ్లవర్ 12 శాతం, క్యాబేజీ 11 శాతం, బంగాళాదుంపలు 4.5 శాతం మేర పెరిగాయి. వీటితో పాటు కోడిగుడ్లు (2.6%), రెడీమేడ్ ఉత్పత్తులు (1.5%), పాలు-పాల ఉత్పత్తులు (0.9%), వంట నూనెలు (0.8%) కూడా ఖరీదైనవిగా మారాయి. గతేడాదితో పోల్చితే వంట నూనెలు, తాజా మాంసం ధరలు 9.5 శాతం, పండ్లు-జీడిపప్పు వంటివి 8.2 శాతం, చేపలు-సముద్ర ఆహారం 7.5 శాతం పెరిగాయి.

రవాణా, ఇతర రంగాలపైనా ప్రభావం

గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ (CNG) మరియు కిరోసిన్ ధరలు పెరిగి ఇంధన ద్రవ్యోల్బణం ఊపందుకుంది. అలాగే రెస్టారెంట్ సర్వీసులు (5.7%), దుస్తులు-పాదరక్షలు (3.0%), గృహోపకరణాల (1.9%) ధరలు పెరగడంతో జ్యువెలరీ మినహాయించిన కోర్ ద్రవ్యోల్బణం 2.2 శాతం నుండి 2.4 శాతానికి పెరిగింది. ఎల్ నినో (El Nino) ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార ధరల పెరుగుదల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ... ఆర్‌బీఐ అంచనా వేసిన 5.1 శాతం కంటే స్వల్పంగా తక్కువగా, అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 5.0 శాతంగా నమోదు కావచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసింది. చమురు ధరల్లో ఇటీవల కనిపిస్తున్న స్వల్ప తగ్గుదల ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని స్పష్టం చేసింది.

Next Story