- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ కోసం ఈసీ గైడ్‌లైన్స్.. 12 రకాల గుర్తింపు కార్డులు ఇవే!
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కోసం ఎన్నికల సంఘం సన్నద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేలోపు ముందస్తు ప్రక్రియలను ముగించేందుకు చర్యలు చేపడుతోంది. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐఆర్‌కు ప్రామాణికంగా తీసుకుంటున్న 2002 ఓటరు జాబితాను తెలంగాణ సీఈవో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది.
ప్రస్తుతం వలసలు, ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి కారణాలతో ఓటరు జాబితాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. 2002లో తెలంగాణలో 2.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 3.50 కోట్లకు చేరింది. దాదాపు 1.30 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను 2002 ఎస్ఐఆర్ జాబితాతో పోల్చే ప్రక్రియను బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంలో తమ వివరాలను నమోదు చేయాలి. 2002 ఎస్ఐఆర్ వివరాలను ఓటర్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్ https://ceotelangana.nic.in లేదా voters.eci.gov.inలోని “Search by Elector Details” ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ వారీగా ఓటరు జాబితాలు పీడీఎఫ్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. తమ పోలింగ్ స్టేషన్ తెలిసిన వారు పీడీఎఫ్‌లలో పేర్లు తనిఖీ చేసుకోవచ్చు.
ఒకవేళ 2002 జాబితాలో పేరు కనిపించకపోతే, ఆ సమయంలో నమోదు కాలేదని అర్థం. అటువంటి వారు తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలను గుర్తించి ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. 2002 ఓటర్ల జాబితా ముద్రిత ప్రతులు బీఎల్‌వోల వద్ద కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్యుమరేషన్ దశలో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, 2002 ఎస్ఐఆర్‌తో సరిపోలని ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారి అర్హత నిరూపణకు అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించనున్నారు.
బీఎల్‌వో లేదా ఈఆర్‌వోను సంప్రదించాలి
ఓటర్లందరూ తమ వివరాలు లేదా తమ తల్లిదండ్రులు/తాతముత్తాతల వివరాలను సరి చేసుకొని బీఎల్‌వో లేదా బీఎల్‌వో సూపర్ వైజర్ ను సంప్రదించి 2002 ఎస్ఐఆర్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సవరణ సమయంలో పత్రాలు సమర్పించే అవసరం లేకుండా ఇబ్బందులను నివారించవచ్చు. మరిన్ని వివరాల కోసం తమ పోలింగ్ స్టేషన్‌కు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) లేదా ఈఆర్‌వోను సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల సంఘం సూచించిన అవసరమైన పత్రాల జాబితా
1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్యూలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్
2. 1.7.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/పీఎస్‌యూల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు
3. జనన సర్టిఫికేట్
4. పాస్‌పోర్ట్
5. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికేట్లు
6. శాశ్వత నివాస సర్టిఫికేట్
7. అడవి హక్కుల సర్టిఫికేట్
8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధృవీకరణ పత్రం
9. జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల)
10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్
11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం
12. ఆధార్






