పేదల ఇళ్ల జోలికి వస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం.. ఈటల హెచ్చరిక

by Prasad Jukanti |

హైడ్రాపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లు కూల్చితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం అంటూ హెచ్చరించారు.

పేదల ఇళ్ల జోలికి వస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం.. ఈటల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు భూకబ్జాదారులను శిక్షించే దమ్ములేదని, దమ్ముంటే భూమి కబ్జా చేసిన వారిని జైల్లో పెట్టాలన్నారు. ఇవాళ బోయినపల్లి, అస్మత్‍పేటలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేతకు వ్యతిరేకంగా ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైడ్రాకు రాజకీయ నాయకుల పేరు ఎత్తే దమ్ము లేదన్నారు. హైడ్రాకు కనికరం లేదని, పేదలు ఆర్తనాదాలు చేస్తున్నా వారి ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందన్నారు.

నోరులేని పేదలపై ప్రతాపమా?:

హైడ్రా దొంగచాటున కూల్చివేత్తలకు పాల్పడుతోందని నిజంగా హైడ్రాకు దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా? కాదా ఎంక్వైయిరీ చేయాలన్నారు. ఇది నిజంగానే ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమిలో లే హౌట్లు వేసింది ఎవరు? దీనికి సహకరించిన అధికారులు, రాజకీయ నాయకులు ఎవరో తేల్చి వారిని జైలుకు పంపించాలన్నారు. అది చేయకుండా నోరులేని పేదలపై ప్రతాపం చూపుతోందన్నారు. బాధితులు కోర్టుకు వెళ్లకుండా శనివారం, ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారన్నారు. ఇలాగే కూల్చివేతలు కొనసాగిస్తే హైదరాబాద్ లో ఏ ఒక్క బస్తీ మిగలదన్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అని ప్రశ్నించారు. పత్రాలు లేని పేదల భూములకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కూల్చివేత్తలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే నగరంలో ఇంత మంది బతికేవారా? అని నిలదీశారు.

ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం:

పేదల ఇండ్లు కూల్చివేస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల వద్దకు మళ్లీ కాంగ్రెస్ రాదా? మీ నాయకులు రారా? అప్పుడు ప్రజలే మీ సంగతి తేలుస్తారన్నారు. ఈ భూములను బ్రోకర్లే అమ్మితే వారిని శిక్షించాలన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి మితిమీరిపోయిందని ఏ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడి చేసినా నోట్ల కట్టలు బయటపడుతున్నాయని, ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ దాడులు చేస్తో కోట్లాది రూపాయలు దొరికాయని అధికారులు ఇంత లంచాలకు ఎగబడుతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.

Next Story