- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala Rajender: మనలో మనం ఆ పని చేయకూడదు.. సొంత పార్టీ సోషల్ మీడియాపై ఈటల సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాను మన శత్రువుపై ప్రయోగించాలి కానీ మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ భయపడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతోందన్నారు. ఎన్నికలను కాలయాపన చేసేందుకే సాకులు వెతుక్కుంటోందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ బైరామాల్ గూడలో బీజేపీ సోషల్ మీడియా, ఐటీ వర్క్ షాప్ లో (BJP Social Media) ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించినట్లు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా స్థానిక సంస్థలకు ఎన్నికలు (Local Body Elections) నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయి. కానీ ‘సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది’ అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.
మనలో మనమే దాడి చేసుకుంటే ఎలా?:
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని దీన్ని శత్రువులపై ప్రయోగించాలని తప్ప మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదని ఈటల అన్నారు. సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనదని అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే అన్నారు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల పరిస్థితి నడిరోడ్డులో చౌరస్తాలో నిలబడినట్లుగా ఉంది. వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా, మీడియాదేనని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండటంతో పాటు సత్వరం స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలని ఈటల అన్నారు. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు అన్నారు.






