Eatala Rajender: కేసీఆర్ నిర్ణయాలు ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్తా.. నోటీసులపై ఈటల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender: కేసీఆర్ నిర్ణయాలు ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్తా.. నోటీసులపై ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ పంపిన నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) హాట్ కామెంట్స్ చేశారు. నాతో పాటు మంత్రులుగా పని చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణరావు, కడియం శ్రీహరికి ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణరావే ప్రస్తుత సీఎస్ అని చెప్పారు. నోటీసులకు భయపడేది లేదని కేసీఆర్ తో వివాదం పెట్టుకోవాలంటే జంకే రోజుల్లోనే ఆరు నెలలపాటు ఆయనతో నేను ఎలా పోరాటం చేశానో తెలంగాణ సమాజం చూసిందన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని నోటీసులు వస్తే పార్టీ అనుమతి తీసుకుని స్పందిస్తానన్నారు. నోటీసుల వ్యవహారంపై ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఏం చేశారో అన్ని చెప్తా:

కేసీఆర్ (KCR) నిర్ణయాలు ఎలా ఉండేవో బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పని చేసి కాంగ్రెస్ లో ఉన్న వారెవరైనా రేవంత్ రెడ్డికి చెప్పి ఉండాల్సిందన్నారు. కేసీఆర్ హాయంలో ఓ సారి మంత్రివర్గ ఉపసంఘం వేశారు. అందులో నేను.. తుమ్మల, కడియం, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాం. మా మంత్రివర్గ ఉపసంఘం ఉండగానే ఏం జరిగిందో తర్వాత మీడియాకు వివరిస్తానన్నారు. తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అబాసుపాలవుతారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇంజినీర్లే తాము ముఖ్యమంత్రి చెప్పినట్లు కట్టామని చెబుతుంటే ఇక మా నిర్ణయాలపై ఏం చెప్తామన్నారు. కమిషన్ గడువు ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రజల ప్రయోజనార్థమా లేక బ్లాక్ మెయిల్ కోసమా అని ప్రశ్నించారు.

Next Story