- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala: ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్
దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని ఈటల సవాల్ విసిరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అబద్ధాలతో కాలం గడిపేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నీ మాట ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలతో పాటు అన్ని వర్గాలు మరోసారి వంచనకు గురయ్యామని రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయామని భావిస్తున్నాయన్నారు. ఇవాళ ఇందిరా పార్క్ (Indira Park) వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏదో డ్రామా చేసి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అవుతుందన్నారు. దమ్ముంటే చర్చకు రా.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత మంది ఓబీసీ మంత్రులకు అవకాశం ఇచ్చారో లెక్కలు తీద్దామన్నారు. రాజ్యాంగ బద్ధంగా లెక్కలు తీసి షెడ్యూల్ 9 లో రిజర్వేషన్లు పొందుపర్చుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అన్నారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం ఒక బీసీ దానికి అధ్యక్షుడు అయ్యే అస్కారం ఉందా? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ముఖ్యమత్రినైనా చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోయారు. బీసీ మంత్రులకు మామూలు మంత్రిత్వ శాఖలే ఇచ్చారని రెవెన్యూ శాఖ, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
ఆ లెక్కలు చెప్పే దమ్ముందా?:
అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏదో మాట వరసకు అన్నారనుకున్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి నైజం, నిజం బయటపడిందన్నారు. సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని నొక్కడానికి బీసీ జాతులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు, యువకులు రేవంత్ రెడ్డి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు వచ్చినా ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఇది సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లేమిటి? ప్రకటించిన డిక్లరేషన్లు ఏమిటో ఏ వర్గానికి ఆ వర్గం ఆలోచన చేయాలన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని దీంతో తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ఫీజులు కడితే తప్ప బీసీ విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఇది వాస్తవమో కాదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని లేకుండా బీజేపీ పార్టీ ఈ ప్రభుత్వం భరతం పడుతుందని హెచ్చరించారు. నిరుద్యోగ యువత తమ సొంత కాళ్లమీద నిలబడి బతికేలా వారికి వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎన్ని లక్షల బీసీ నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చారో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
ఎవరిని బుకాయిస్తున్నావ్?
బూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేశానని చెప్పిన రేవంత్ రెడ్డి కులగణన లెక్కలు మాత్రం గణాంక శాఖతో చేయించారు. దీనికి చట్టబద్ధత ఉంటుందా రేవంత్ రెడ్డి?.. ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? ఎవరిని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావ్? బీసీలంటే తెలివి లేనివారిగా భావిస్తున్నావా అని మండిపడ్డారు. ప్రతి బీసీ కుటుంబంలో పీజీలు, పీహెచ్ డీలు చేసిన వారు ఉన్నారు. ఏ విషయాన్నైనా ఇట్టే తెలుసుకోగలిగే సత్తా ఉన్నా ఈ కాలంలో మోసం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి ఆలోచన చేయాలన్నారు.






