- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajender: కన్నీళ్లకు కరిగిపోయారో, మోసానికి కరిగిపోయారో.. హుజూరాబాద్ ఓటమిపై ఈటల ఎమోషన్
ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కన పెట్టారని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ ను నమ్మరు.. ఇద్దరినీ చూశాం కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పనని చెప్పుకున్న కేసీఆర్ మాట తప్పితే, వాటిని నెరవేరుస్తామని వచ్చిన రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. మంగళవారం హుజురాబాద్ (Huzurabad) లో నిర్వహించే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో (MLC Elections Campaign) మాట్లాడిన ఆయన.. ఆరు గ్యారెంటీలు ఇచ్చి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాటల గారడి, అబద్ధాలతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాధులపై రాజ్యం ఏలాలని చూస్తున్నదని దీన్ని నిలువరించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం చారిత్రక అవసరం అన్నారు.
అందుకే ఇంత కాలం ఓపిక పట్టాం:
గెలిచిన తర్వాత పని చేయడానికి సమయం ఇవ్వలేదని తప్పించుకుంటారనే ఇంత కాలం కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కొంత ఓపిక పట్టాం. అయినా ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసింది బీజేపీనే (BJP) అన్నారు. వందకు వంద శాతం ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ తేలిపోయిందని ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ఈటల అన్నారు. ఈ విషయం నేను మాట్లాడుతున్నది కాదని కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలే చెబుతున్నారన్నారు.. టీచర్లను కన్నీళ్లు పెట్టించిన 317 జీవో, పెండింగ్ డీఏలపై రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం ఇవ్వాల్సిన దౌర్భగ్యం మనం చూస్తున్నామన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పే మొఖం కాంగ్రెస్ పార్టీకి లేదని, బీఆర్ఎస్ కు అభ్యర్థే లేదని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ (BRS) ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా పరిస్థితులు మారాయని ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లు, కాలేజీల యాజమాన్యాలు కన్నీళ్లు పెడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.
కన్నీళ్లకు కరిగిపోయారో, మోసానికి కరిగిపోయారో..
గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గంలో ఏం జరిగిందో నా కంటే మీకే బాగ తెలుసు. గతంలో నియోజకవర్గంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆదుకున్నాం. కానీ ఇప్పుడు కుటుంబాలను కాపాడుకునే వ్యవస్థకు విఘాతం కలిగిందని ఆయా కుటుంబ సభ్యులే ఆవేదనతో నాకు ఫోన్ చేస్తున్నారు. కన్నీళ్లకు కరిగిపోయారో, మోసానికి కరిగిపోయారో.. అయిందేదో అయిపోయింది. మళ్లీ పాతరోజులు వస్తాయనే నమ్మకం నాకు ఉంది. ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉంది. కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దు. సర్పంచ్ ఎన్నికలప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తా. నా ముందున్న ప్రథమ కర్తవ్యం వార్డు మెంబర్ నుంచి గ్రామ సమర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అన్ని స్థానిక సంస్థల్లో అందరిని గెలిపించుకునే భాధ్యత నాది అన్నారు. నా 20 ఏళ్ల హుజారాబాద్ రాజకీయ చరిత్రలో నా ఎన్నికలప్పుడు గెలవాలని ఎలా పోరాటం చేస్తానో వార్డు మెంబర్ గెలవాలని కూడా అంతే పోరాటం చేస్తానని ఈ విషయం అందరికీ తెలుసన్నారు. ఇది సాధ్యం కాదు అనేది నా డిక్షనరీలో లేదని ఏది జరిగినా మన మంచికోసమే జరిగిందనుకోవాలన్నారు. రాజకీయాలు ఎప్పుడు పూలబాట కాదు. అది ముళ్లబాట. అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనన్నారు.






