Eatala Rajender: హెచ్ సీయూ భూముల జోలికి వస్తే ఖబర్దార్.. ఎంపీ ఈటల హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2025-04-02 05:46:00  IST  )

హెచ్ సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender: హెచ్ సీయూ భూముల జోలికి వస్తే ఖబర్దార్.. ఎంపీ ఈటల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఆరోపించారు. భూములు అమ్మకపోతే ఒక్కరోజూ కూడా ప్రభుత్వాన్ని నడవలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఒడిగడుతోందని దుయ్యబట్టారు. హెచ్ సీయూ భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీ బీజేపీ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల హెచ్చరించారు. ఓ వైపు రాష్ట్రంలో ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిద్దామంటే స్థలాలు దొరకని పరిస్థితి ఉంటే యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు అమ్మకానికి పెట్టిందని ఫైర్ అయ్యారు.

తెలంగాణ భవన్ వద్ద ధర్నా:

హెచ్ సీయూ భూముల విషయంలో తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఎంపీలమంతా నిన్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్రయాదవ్ ను కలిశామని అనుమతులు లేకుండా ఒక్క చెట్టు తొలగించడానికి, పర్యావరణం ధ్వంసం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు చెప్పారన్నారు. ఇవాళ తెలంగాణ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద హెచ్ సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం భూముల విషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు యావత్ పార్టీ శక్తిమేరకు విద్యార్థులకు అండగా నిలుస్తామని చెప్పారు. వెంటనే బుల్డోజర్లు, పోలీసులు యూనివర్సిటీని వదిలి వెనక్కి వెళ్లిపోవాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థుల రక్తం కళ్లచూస్తున్నారు:

మా భూములు అమ్మవద్దని, కాంక్రీట్ జంగల్ గా మార్చవద్దని యూనివర్సిటీ విద్యార్థులు మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి అక్కడ పోలీసులను ఉసిగొల్పి బోల్డోజర్లతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల చేత ఈ ప్రభుత్వం విద్యార్థుల రక్తాన్ని కళ్లచూస్తోందని వారిని జైళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్ సీయూ విద్యార్థుల పోరాటానికి, యూనివర్సిటీ భూములకు అండగా తెలంగాణలోని మిగతా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు సంఘీభావం తెలుపుతున్నారన్నారు.

Next Story