గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం.. రూ. 88 కోట్ల మందులు చెత్తపాలు!

by Prasad Jukanti |

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రూ.88 కోట్ల విలువైన మందులు ఎక్స్‌పైరీ అయ్యి వృథాగా పోయాయని కాగ్ నివేదిక వెల్లడించింది.

గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం.. రూ. 88 కోట్ల మందులు చెత్తపాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన మందులు చెత్త పాలైనట్టు కాగ్ నివేదికలో వెల్లడైండి. గత సర్కార్ హయాంలోనే ఇదంతా జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మందుల కొనుగోళ్లపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన మందులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీగా పనికి రాకుండా పోయాయి. ముఖ్యంగా 2017 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు రూ.88.15 కోట్ల విలువైన మందులు వాడకానికి ముందే కాలం చెల్లిపోయినట్లు (ఎక్స్‌పైరీ) అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మెరుగైన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వల్ల గత రెండేళ్లలో ఈ వృథా గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడించారు.

మందుల నష్టం వివరాలు...

గత ప్రభుత్వంలోనే అధిక నష్టం : మంత్రికి నివేదిక

ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్స్‌ కోసం మెడిసిన్ కొనుగోలు వివరాలతో తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు బుధవారం నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయగా.. అందులో కేవలం రూ.9 లక్షల మెడిసిన్ మాత్రమే ఎక్స్‌పైరీ అయినట్టు తెలిపారు. 2017 నుంచి 2023 వరకూ సుమారు రూ.2,700 కోట్ల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయగా.. అందులో ఏకంగా రూ.88 కోట్ల విలువైన మెడిసిన్ వృథాగా పోయిందని వివరించారు. 2021–2023 మధ్య ఈ వృథా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 2021లో రూ.26 కోట్లు, 2022లో రూ.27 కోట్లు, 2023లో రూ.12 కోట్ల మెడిసిన్ ఎక్స్‌పైరీ అయ్యి, చెత్తబుట్టపాలు అయినట్టు అధికారులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే మెడిసిన్ వృథా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు మంత్రికి వివరించారు. మెడిసిన్ ఎక్స్‌పైరీ అవ్వడానికి 3 నెలల ముందే, హాస్పిటల్స్ నుంచి వెనక్కి తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్‌కు అయ్యే మొత్తం ఖర్చును మెడిసిన్ సప్లయ్ చేసిన సంస్థే భరించే విధంగా టెండర్లు నిర్వహిస్తున్నామన్నారు.ఈ రెండున్నరేళ్లలో ఎక్స్‌పైరీ అయిన రూ.9 లక్షల విలువైన మెడిసిన్‌కు బదులు, అంతే విలువైన మెడిసిన్‌ను గుత్తేదారు ఉచితంగా సప్లయ్ చేశారని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు మంత్రికి వివరించారు.

కాంట్రాక్టర్ నుంచే మినహాయిస్తాం : అధికారులు

టెండర్ నిబంధనల ప్రకారం.. కాలం చెల్లిన మందుల విలువను సదరు సరఫరాదారులకు చెల్లించాల్సిన బిల్లుల నుంచి మినహాయిస్తారు. అలాగే, ఎక్స్‌పైరీ అయిన మందులను ఈ-ఔషధి పోర్టల్‌లో వెంటనే ఫ్రీజ్ చేస్తారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు పంపిణీ చేయరని అధికారులు స్పష్టం చేశారు. కాలం చెల్లిన స్టాక్‌ను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనల ప్రకారం డిస్కార్డ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సంస్థకు రేట్ కాంట్రాక్ట్ అప్పగించి, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మందుల నిర్వీర్యం చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story