Domakonda Nalini: మరణ వాంగ్మూలం.. తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ

by Ramesh Naini |   (  Updated:2025-09-21 06:49:51  IST  )

తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని ( వీలునామా/ మరణ వాంగ్మూలం) అంటూ సంచలన బహిరంగ లేఖ రాశారు.

Domakonda Nalini: మరణ వాంగ్మూలం.. తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్ర ప్రజలకు (Former DSP Nalini) డీఎస్పీ నళిని ( వీలునామా/ మరణ వాంగ్మూలం) అంటూ సంచలన బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఫేస్‌బుక్ ఖాతా వేదికగా తెలిపారు. ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది.. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నానని తెలిపారు. 8 ఏళ్ల క్రితం సోకిన (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు వల్ల గత రెండు నెలలుగా టైపాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌ల వల్ల తీవ్ర స్థాయికి చేరిందని పేర్కొన్నారు.

25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్‌గా మారిపోయిందన్నారు. స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్లీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తోంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులు వాడక తప్పని పరిస్థితి.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి.. అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయని తెలిపారు. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపిందన్నారు. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే, 12 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని అనుభవించానని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నా ఫైల్‌ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను.. అని వెల్లడించారు. రూ. 2 కోట్ల పెండింగ్ బకాయిల కోసం తాను చేసిన 16 పేజీల విజ్ఞప్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసిందని నళిని ఆరోపించారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు వదులుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరారు. నా బకాయిలను క్లియర్ చేయండి.. నా నమ్మకానికి మద్దతు ఇవ్వండి.. నేను చనిపోతే, నన్ను "సస్పెండెడ్ ఆఫీసర్" అని రాయకండి.. అని పేర్కొన్నారు. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని సంభోదించాలని సూచించారు.

బ్రతుకుండగా తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు నన్ను సన్మానించలేదు.. నేను చనిపోయాక అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.. అని పేర్కొన్నారు. నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయాను. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి.. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను.. అని ఎఫ్‌బీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. Post Link..

Next Story