- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోర్త్ సిటీ కేంద్రంగా డ్రై పోర్టు..! బందర్ పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
రాష్ట్రంలో తయారయ్యే, ఉత్పత్తి అయ్యే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన డ్రై పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తయారయ్యే, ఉత్పత్తి అయ్యే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన డ్రై పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక వేత్తలు సులువుగా ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని భావిస్తున్నది. డ్రై పోర్టు ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నానుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు అనేక మార్లు దీని గురించి చెప్పినా ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ సమస్య తీవ్రతను గుర్తించి డ్రై పోర్టు పనులు ప్రారంభమయ్యే విధంగా ప్రణాళిక రచించారు. డ్రై పోర్టుకు పెద్ద ఎత్తున భూమి అవసరం ఉండటంతో అందుకు ఫోర్త్‌సిటీని ఎంపికచేశారు. అక్కడ ఎంత భూమి అవసరం ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేసి అధికారులు నివేదిక ఇవ్వగానే దానికి అవసరమైనంత భూమిని కేటాయించనున్నారు. అనంతరం పనులు ప్రారంభించేలా ఆదేశాలు వెలువడనున్నాయి.
ఆలస్యం కాకుండా..
రాష్ట్రంలో డ్రై పోర్టు ఆలస్యం కావడానికి వీల్లేదని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పారిశ్రామికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం, అంతర్జాతీయ ఎగుమతులు పెరగడానికి డ్రై పోర్టులు ఎంతో అవసరం అవుతాయని నిర్ధారణకు వచ్చా రు. ఫోర్త్ సిటీలో డ్రైపోర్టు ఏర్పాటు చేయడం వలన అక్కడి నుంచి బందర్పోర్టుకు కనెక్ట్చేస్తూ రైల్వే లైన్ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేసిందని సమా చారం. దీనితో పాటుగా ఫోర్త్‌సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ నేషనల్హైవే ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి దూరం తగ్గుతుందని, ఇదే రహదారి బందరు పోర్టుకు వెళ్లే రోడ్డును కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు సరుకు, వస్తు రవాణా సులువు కానుంది.
సముద్రం లేకపోవడంతో..
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో ఇక్కడ పోర్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. పోర్టుల ద్వారానే విదేశాలకు సరుకు రవాణా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని బందర్, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. అందుకే అక్కడ నుంచి ఎగుమతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పోర్టుల్లో చేసే తనిఖీలు, నాణ్యత, అనుమతులు, అధికారిక ప్రక్రియ అన్నింటినీ డ్రై పోర్టుల్లో పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అందుకే పోర్టులో కాకుండా డ్రై పోర్టులోనే ఈ విధానాన్ని తీసుకొస్తే పరోక్ష, ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సర్కారు భావిస్తోంది. ఫోర్త్‌సిటీతో పాటు జహీరాబాద్‌లోనూ మరొక డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అక్కడ భూ సేకరణ పూర్తయ్యాక అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక్కడ నిమ్జ్ ఏర్పాటు, ట్రాక్టర్ల తయారీ, ఆటో మొబైల్విభాగానికి చెందిన పరిశ్రమలు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో ఆయా కంపెనీలు ఈ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డ్రైపోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన సాయం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే, డ్రై పోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సరియైన అవగాహన రాలేదు. స్థలం అందుబాటులో లేదంటూ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా ఆనాడు పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలింది.






