డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన స్కూల్ బస్సుల డ్రైవర్లు

by Bhanu |

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారులలో ముఖ్యంగా పాఠశాలల బస్సులు నడిపే డ్రైవర్లలో మార్పులు రావడం లేదు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన స్కూల్ బస్సుల డ్రైవర్లు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారులలో ముఖ్యంగా పాఠశాలల బస్సులు నడిపే డ్రైవర్లలో మార్పులు రావడం లేదు. యదేచ్ఛగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు . మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టబడి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.


మద్యం సేవించి పట్టుబడుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నగర వ్యాప్తంగా ప్రతిరోజు చేపడతామని, పట్టుబడితే జైలుశిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని పోలీసులు ముందు నుండి హెచ్చరిస్తున్నారు . రూ వేలల్లో జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశముందని స్కూల్ బస్సుల డ్రైవర్లకు వార్నింగ్ ఇస్తున్నా వారు పోలీసుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాగి వాహనం నడిపి డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోతూనే ఉన్నారు .

ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో పట్టుబడిన డ్రైవర్లు..

బుధవారం రోజున పశ్చిమ, ఉత్తర జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ఎస్ఆర్ నగర్, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, తిరుమల్ గిరి, మహంకాళి, గోపాలపురం ప్రాంతాలలోని 34 ప్రదేశాలలో స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడంపై ట్రాఫిక్ 1 అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరి ప్రసాద్ , నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ ల అధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.


ఈ స్పెషల్ డ్రైవ్ సమయంలో పోలీసులు మొత్తం 324 స్కూల్ బస్సులను తనిఖీ చేయగా వాటిలో ఐదుగురు స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ 1 డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు డబ్ల్యూపీ (సివిల్) 1309 ఆఫ్ 1985 ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పాఠశాల పిల్లలను వారి నివాసం నుండి పాఠశాలకు, పాఠశాల నుండి ఇంటికి రవాణా చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి .

1. సంబంధిత అధికారం జారీ చేసిన వాహనానికి "ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్" అని తగిన అనుమతి ఉండాలి

2. అటువంటి పాఠశాల పిల్లలను తీసుకెళ్లే ప్రతి వాహనం వెనుక , ముందు భాగంలో "ఆన్ స్కూల్ డ్యూటీ" అని శాశ్వతంగా వ్రాయబడాలి.3. వాహనం దాని అనుమతించబడిన సీటింగ్ సామర్థ్యానికి మించి పిల్లలను తీసుకెళ్లకూడదు. ఏ పిల్లవాడిని ఇతరుల ఒడిలో కూర్చోబెట్టడానికి అనుమతించకూడదు.

4. వాహనంలో ప్రథమ చికిత్స పెట్టె, తాగునీరు ఉండాలి.

5. అవసరం ఉన్న చోట సీటు బెల్టులను సరిగ్గా బిగించాలి.

6. పాఠశాల పేరు , టెలిఫోన్ నంబర్‌ను ప్రదర్శించాలి.

7. పాఠశాల పిల్లలను తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని అటువంటి వర్గాల వాహనాలను నడపడంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండి గతంలో ట్రాఫిక్ నేరాలకు సంబంధించిన రికార్డులు లేని డ్రైవర్ ఉండాలి

8. పాఠశాల పిల్లలను తీసుకెళ్లినందుకు కాంట్రాక్ట్ క్యారేజ్‌పై కేసు నమోదు చేయబడినప్పుడల్లా, వాహన యజమాని స్థానిక పోలీస్ స్టేషన్,డిసిపి,ఎస్పీ, జిల్లా ట్రాఫిక్‌కు డ్రైవర్ పేరు , వాహనం యొక్క వివరాలను సూచిస్తూ సమాచారం ఇవ్వాలి.

9. పిల్లల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి, అందించడానికి అటువంటి ప్రతి వాహనంలో ఒక అటెండెంట్ ఉండాలి. పిల్లలను సురక్షితంగా ఎక్కించడానికి , దిగడానికి తగిన సహాయం అందించాలి. పైన పేర్కొన్న అన్ని మార్గదర్శకాలు ట్రాఫిక్ నియమాలను పాఠశాల బస్సుల డ్రైవర్లు పాటిస్తున్నారని పాఠశాల యాజమాన్యం నిర్ధారించుకోవాలి.

Next Story