KTR: ఇకపై అక్కడ కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి: కేటీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-24 07:23:30  IST  )

ముఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే, కింద కాంగ్రెస్ గుండాలు మద్యం మత్తులో వీర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

KTR: ఇకపై అక్కడ  కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే కింద కాంగ్రెస్ గుండాలు మద్యం మత్తులో వీర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. నిన్న మంత్రి సీతక్క (Seethakka) హాజరైన కార్యక్రమలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై (Palla Rajeshwar Reddy) జరిగిన దాడి ఘటనను ఆయన ఖండించారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగొచ్చి వీధిరౌడీల్లా వ్యవహరించడం తెలంగాణలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దంపడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన కేటీఆర్.. అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొని ఉందన్నారు.

ఫ్యాక్షన్ సంస్కృతిని ఈ గడ్డ సహించదు:

ముఖ్యమంత్రే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ ను తీవ్రంగా దెబ్బతీసే సంఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీతోపాటు తెలంగాణ సమాజం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టిపరిస్థితుల్లో సహించదన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‍కు కర్రుగాల్చి వాతపెట్టిందని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారన్నారు.

Next Story