డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి పోరాడుదాం: తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-08 11:24:38  IST  )

డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి పోరాడుదాం: తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కేవలం అధికారుల వల్ల మాత్రమే సాధ్యం కాదని.. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, విద్యాసంస్థలు, సమాజం, పౌరులంతా ఒకరికొకరు సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగినపుడే డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టగలమని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ పి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమగ్ర అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. నిరంతరం నిఘాతో పాటుగా పోలీసులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1908 ద్వారా ప్రజలు అందిస్తోన్న సమాచారం.. డ్రగ్స్ నెట్వర్కులను ఛేదించేందుకు ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. కానీ.. డ్రగ్స్ మాఫియా ఇంకా విద్యార్థులను, విద్యా సంస్థలను టార్గెట్ చేసి.. రేపటి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను ఈ మత్తు ప్రమాదం నుంచి రక్షించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా నష్టా ముక్త్ భారత్ అభియాన్ మూడు ప్రధాన అంశాలపై పనిచేస్తుందని ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు వివరించారు. డ్రగ్స్ ను విక్రయించే ముఠాలు, వ్యాపారులపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడం, మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఇప్పటికే డ్రగ్స్ కు బానిసైన వారిని.. ఆ అలవాటు నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడం వంటి అంశాలపై పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్యకరమైన సమాజమే ప్రభుత్వ సంకల్పం

పీఐబీ, సీబీసీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ బ్యూరో నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా డ్రగ్స్ రహిత, సురక్షితమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. వ్యసనంతో బాధపడుతున్నవారిని అసహ్యంగా, క్రూరంగా చూడకుండా వారికి అండగా నిలిచి.. గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపేలా సమాజం సహాయం చేయాలని కోరారు.

యువతకు పెద్ద సవాలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. నేటి కాలంలో ఆన్‌లైన్, సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ మహమ్మారి యువతకు, వారి కుటుంబాలకు, దేశ ప్రగతికి పెద్ద సవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని హితవు పలికారు. ఈ అవగాహన సదస్సులో తెలుసుకున్న విషయాలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలకు, స్నేహితులకు చేరవేసి ఈ దేశవ్యాప్త పోరాటంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ఇవాల్యువేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మట్టా, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సీబీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story