2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం

by Naga Rani Yarlagadda |

దేశ భవిష్యత్తును పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది.

2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం
X
  • ముప్పేట దాడికి 3 ఏళ్ల ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం
  • సాంకేతికతే అస్త్రంగా మాదక ద్రవ్యాల నెట్‌వర్క్ ధ్వంసం
  • రాజ్యసభలో కేంద్ర హోం శాఖ కీలక వివరాలు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ భవిష్యత్తును పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. 2029 నాటికి 'డ్రగ్ రహిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 నుంచి 2029 వరకు అమలు చేసేలా మూడేళ్ల ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర సంస్థలను కేంద్రం ఆదేశించింది. డ్రగ్స్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ఉన్న గొలుసుకట్టు నెట్‌వర్క్‌ను ఛేదించడమే కాకుండా, నిందితులకు శిక్షలు పడేలా అత్యాధునిక ఏఐ, డ్రోన్ టెక్నాలజీలను రంగంలోకి దించుతోంది. పార్లమెంటులో ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది.

సాంకేతికతతో డ్రగ్ నెట్‌వర్క్‌పై నిఘా

నేరగాళ్లకు శిక్షలు పడేలా చూడటంతో పాటు, డిజిటల్ చెల్లింపుల ద్వారా సాగుతున్న నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. క్రైం జరిగిన ఏరియా నుండి నేరుగా ఆధారాలను రికార్డు చేసేందుకు పోలీసులకు ఈ-సాక్ష్య పోర్టల్ సహకరిస్తుంది. బ్యాంక్ ఖాతాలు, పన్ను రికార్డులను విశ్లేషించి నిధుల ప్రవాహాన్ని గుర్తించేందుకు నాట్‌గ్రిడ్ ఉపయోగపడుతుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ద్వారా జరిగే లావాదేవీలపై నిఘా ఉంచడానికి, ఆస్తులను సీజ్ చేయడానికి సహయోగ్ పోర్టల్ రూపొందించారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్.ఎఫ్.ఎస్.యు) సహకారంతో డార్క్ నెట్, డ్రోన్ ఆధారిత ఫోరెన్సిక్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) వినియోగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా గొలుసును మూలాల నుంచే తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ సహకారం కోసం ఎన్సీబీ... రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్.ఆర్.యు)తో ఎంఓయూ కుదుర్చుకుంది. డ్రగ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు విస్తృత స్థాయిలో ఉన్నాయి. కేవలం దాడులు మాత్రమే కాకుండా, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ద్వారా పోలీసులకు, ఎన్సీబీ అధికారులకు సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. 2029 నాటికి యువతను ఈ మహమ్మారి నుంచి రక్షించి, దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ సీజ్

గత ఐదేళ్లలో డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 నుంచి 2025 నవంబర్ వరకు దేశవ్యాప్తంగా వివిధ ఏజెన్సీలు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,06,794 కోట్లుగా ఉండటం గమనార్హం.

Next Story