కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డి

by Ramesh Naini |

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రమేష్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నారు. గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) గానూ పనిచేశారు. గత నెల 28న కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ నందకుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను అక్రమంగా పాస్‌ చేశారని, ఇంచార్జిల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వీసీ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే తిరిగి యూనివర్సిటీకి వచ్చి.. కొత్త వీసీ వచ్చే వరకు తననే ఆపద్ధర్మ వీసీగా కొనసాగమన్నారంటూ ఆయనే మీడియాకు చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే వర్సిటీని గాడిన పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పుడు ఇంచార్జ్ వీసీని నియమించింది. గతంలో డీఎమ్ఈగా పనిచేసిన అనుభవం ఉన్న రమేష్ రెడ్డిని యూనివర్సిటీ పాలన వ్యవస్థను సరిచేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే వైద్య విద్యలో విశేష అనుభవం ఉన్న డా. రమేష్ రెడ్డి అయినా అస్తవ్యస్తంగా మారిన కాళోజీ వర్సిటీని గాడిన పెట్టి వైద్య విద్యను పట్టాల పైకి ఎక్కిస్తారని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కాళోజీ వర్సిటీ పరిధిలో ఈ ఏడాది పీజీ అడ్మిషన్లలో ఇంకా గందరగోళం నడుస్తోంది. నీట్ పీజీ రెండు దశల కౌన్సిలింగ్ (ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్) లో పాల్గొనేందుకు మిగతా రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకుండా పోతోంది. కోర్టు కేసుల పేరిట కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఏ మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంతో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమే కాకుండా పోయి.. తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ వంటి ఎంతో మెరుగైన పీజీ సీట్లను కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వర్సిటీకి ఇంచార్జి వీసీ రావడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న డా.రమేష్ రెడ్డి వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.

పీజీ విద్యార్థుల సమస్య పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం.. ఇంచార్జ్ వీసీ డా. రమేష్ రెడ్డి

నీట్ పీజీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కు సమాంతరంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా జరగకపోతే మన విద్యార్థులు ఎంతో నష్టపోతారని, అందుకే ఈ విషయంలో మన రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేసేందుకు వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని ఇంచార్జ్ వీసీ డా. రమేష్ రెడ్డి 'దిశ పత్రిక'కు తెలిపారు. ఎంతో కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకున్న మన విద్యార్థులకు వారి ర్యాంకులకు తగ్గట్లుగా సరైన ప్రాధాన్యత ఉన్న పీజీ సీట్లు దక్కేలా చేయడం తమ బాధ్యత అని, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే వెంటనే బాధ్యతలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య విద్యా వ్యవస్థను సవ్యంగా నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Next Story