- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాప్ 2 ఆవిష్కర్తల్లో చోటు.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు. మెడికల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ (ఏఐఎంబీఈ) కాలేజ్ ఆఫ్ ఫెలోస్ కు ఆయన ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యం, బయోలాజికల్ ఇంజనీరింగ్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 2 శాతం మంది నిపుణులకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఈ ఎలైట్ గ్రూపులో నోబెల్ బహుమతి గ్రహీతలు, అమెరికా నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ విజేతలు సభ్యులుగా ఉన్నారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీని కేవలం వ్యాధి నిర్ధారణ పరీక్ష స్థాయి నుండి, శక్తివంతమైన చికిత్సా విధానం వైపు మళ్లించిన ఘనత డాక్టర్ రెడ్డికి దక్కుతుంది. నాగి స్టెంట్ ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్‌ల చికిత్స కోసం ఆయన రూపొందించిన నాగి స్టెంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇది కనిష్టంగా కోత పెట్టే (మినిమల్లీ ఇన్వేసివ్) చికిత్సా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఏఐఎంబీఈ ఫెలోగా డాక్టర్ రెడ్డి ఇకపై ప్రపంచ ఆరోగ్య విధానాలు, బయోమెడికల్ పరిశోధనలు, అత్యాధునిక వైద్య సాంకేతికతను సామాన్యులకు చేరవేసే కీలక ప్రక్రియల్లో భాగస్వామి అవుతారు.
సాంకేతికతతోనే మెరుగైన వైద్యం.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఏఐఎంబీఈ ఫెలోగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్లు డా. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మనం వైద్య రంగంలో పరివర్తనాత్మక యుగంలో ఉన్నామని, క్లినికల్ నైపుణ్యం, ఇంజనీరింగ్ ప్రతిభ, ఏఐ తోడైతే భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వైద్య సేవలను సమూలంగా మార్చవచ్చన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, విధాన నిర్ణేతలు కలిసి ఒకే వేదికపైకి వచ్చినప్పుడే తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన వైద్యం కోట్లాది మందికి అందుతుందని పేర్కొన్నారు.






