- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపొద్దు.. CM రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకే ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకే ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గండిపేట్‌లో మూసీ పునరుజ్జీవం (Musi Revival) ప్రాజెక్టులో భాగంగా రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టబోయే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు (Godavari Drinking Water Scheme Project) ఫేజ్-2, 3 పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ గొప్ప నగరంగా నిలవబోతోందని అన్నారు. గతంలో నగరాన్ని మూసీ ముంచెత్తినప్పుడు నిజాం రాజు ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఏటా 3శాతం జనాభా హైదరాబాద్‌కు వలస వస్తుందని తెలిపారు. తాగునీటి అవసరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పీజేఆర్ పోరాటంతో నగరానికి మంజీరా జలాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎండకాలం వచ్చిందంటే సచివాలయం ముందు నిసరనలు హోరెత్తేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు పీజేఆర్ పోరాటంతోనే మంజీరా జలాలు నగరానికి వచ్చాయని గుర్తు చేశారు. 2002లో కృష్ణా జలాలు హైదరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నగరానికి తరలించారని పేర్కొన్నారు. గోదావరి తలపైన చల్లుకున్నంత మాత్రాన.. చేసిన పాపాలు పోవని మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి సెటైర్లు వేశారు. హైదరాబాద్ దాహం తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నల్గొండ ప్రజల మనసు తెలుసుకున్నా..
మూసీ విషయంలో నల్గొండ ప్రజల మనసు తెలుసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి కోరిక ప్రకారమే మూసీ ప్రక్షాళన మొదలు పెట్టామని కామెంట్ చేశారు. ఎవరు అడ్డం పడినా.. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రూ.360 కోట్ల నిధులతో ఉస్మాన్ సాగర్‌కు 20 టీఎంసీల గోదావరి జలాలతో నింపుతామని అన్నారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగు నీరు, ఉమ్మడి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. కొందరు తాటిచెట్టులా ఎదిగినా బుద్ధి మాత్రం రాలేదని.. హరీశ్‌రావును ఉద్దేశించి కామెంట్ చేశారు. తాము మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకురావడం లేదని.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నగరానికి గోదావరి జలాలను తీసుకొస్తున్నామని అన్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ సర్కార్ అని గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్లతో రంగారెడ్డి జిల్లాను సశ్యశ్యామలం చేయాలనుకుంటున్నామని అన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. తమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని భయం..
మూసీ నది మురికి కూపంగానే ఉండాలని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గంగా, యమునా, సబర్మతీ నదులు మాత్రమే ప్రక్షాళన కావాలా..? అని కేంద్రాన్ని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మూసీ ప్రక్షాళన గురించి ఎందుకు ఆలోచించలేదని కామెంట్ చేశారు. నేడు మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే బీఆర్ఎస్ ఉన్న భయమని అన్నారు. మూడు నెలల్లో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ను మేటిగా తీర్చుదిద్దుతామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్లానింగ్ వల్లే హైదరాబాద్ నేడు ఈ స్థాయికి చేరిందన్నారు. కడుపులో విషయం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపొద్దని.. హైదరాబాద్ మరింత అభివృద్ధికి కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






