లైకుల కోసం ప్రాణాలతో చెలగాటం వద్దు.. ఆకతాయిలకు సజ్జనార్ గట్టి వార్నింగ్!

by Ramesh Naini |

హైదరాబాద్ మహానగర రోడ్లపై ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. చీకటి పడితే చాలు.. పలు ప్రదేశాల్లో రోడ్లు, ఫ్లైఓవర్లపై కొందరు యువకులు బైక్ స్టంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

లైకుల కోసం ప్రాణాలతో చెలగాటం వద్దు.. ఆకతాయిలకు సజ్జనార్ గట్టి వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ మహానగర రోడ్లపై ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. చీకటి పడితే చాలు.. పలు ప్రదేశాల్లో రోడ్లు, ఫ్లైఓవర్లపై కొందరు యువకులు బైక్ స్టంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. విన్యాసాల రీల్స్ చేస్తూ సామాన్య వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా వీరి తీరు మారకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నగరంలో బైక్ స్టంట్స్ చేస్తున్న ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసిన సీపీ సజ్జనార్, యువతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

కిక్ కోసం చూస్తే.. జీవితం రిస్క్ లో పడ్డట్టే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సజ్జనార్ స్పందిస్తూ.. ‘బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం’ అని హెచ్చరించారు. రోడ్డు మీద చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూడడానికి థ్రిల్లింగ్ గా, చేసేవారికి క్షణకాలం కిక్ ఇవ్వొచ్చని, కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా జీవితాంతం మంచాన పడాల్సి వస్తుందన్న నిజాన్ని మరువకూడదని ఆయన సూచించారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, రోడ్డు మీద నలుగురిలో హీరోయిజం చూపించుకోవడం కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన సూచించారు. ‘మీ సరదా వల్ల ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. బాధ్యతగా డ్రైవ్ చేయండి’ అని కోరారు. బైక్ పై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ, వెనుక కూర్చున్న వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టడం చట్టరీత్యా నేరమని సజ్జనార్ స్పష్టం చేశారు. అనవసరంగా కేసులు పాలై, సమస్యలను కొని తెచ్చుకోవద్దని ఆకతాయిలను హెచ్చరించారు.

Next Story