నిరుప‌యోగంగా ప‌ర్యాట‌క శాఖ బ‌స్సుల‌ను ఉంచొద్దు.. అధికారులపై మంత్రి జూప‌ల్లి ఫైర్

by Ramesh Naini |

రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

నిరుప‌యోగంగా ప‌ర్యాట‌క శాఖ బ‌స్సుల‌ను ఉంచొద్దు.. అధికారులపై మంత్రి జూప‌ల్లి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యాటక ఆస్తుల వినియోగం, ప్రాచూర్యం, ప్ర‌చారం, ఆదాయ మార్గాలు, హరిత హోటళ్ల నిర్వ‌హ‌ణ‌, పెండింగ్ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సూచిక బోర్డులు, ఫుడ్ కోర్టులు, టూరిజం సమాచార కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాల స్థితిగతులపై మంత్రి సమీక్షించారు. బోటింగ్ సౌకర్యాలు, కాటేజీలు, వ్యూ పాయింట్లు, హ‌రిత‌హోట‌ళ్ల‌ నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్ర‌మోష‌న్, ప్ర‌చారం వంటి అంశాల‌పై ప్రత్యేక‌ దృష్టి పెట్టాల‌ని సూచించారు.

ఆయా రాష్ట్రాల విధానాల అధ్యయనం:

ప‌ర్యాట‌క ప్ర‌చారంపై ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేసి వాటికి ధీటుగా మ‌న ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు ప్ర‌చారం క‌ల్పించాల‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వీటిని పూర్తి చేయాల‌న్నారు. కేవలం దారి చూపడమే కాకుండా, ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతను బోర్డులపై క్లుప్తంగా వివరించాలని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప‌ర్యాట‌క కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూత అందించే దిశగా చర్యలు ఉండాలని, ప్రసిద్ధ ప్ర‌దేశాల్లో హంపి థియేట‌ర్లు నిర్మించాల‌ని మంత్రి జూప‌ల్లి పేర్కొన్నారు.

టూరిజం బస్సుల వివరాలపై మంత్రి ఫైర్:

ప‌ర్యాట‌క శాఖ ఆద్వ‌ర్యంలో ఆయా రూట్ల‌లో న‌డుస్తున్న బ‌స్సుల వివ‌రాల‌ను, ఆదాయంపై మంత్రి ఆరా తీశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప‌ర్యాట‌క‌ ప్యాకేజీలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంతో గ‌ణ‌నీయంగా ఆదాయం త‌గ్గిందని మంత్రికి అధికారులు స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చెప్ప‌గా మంత్రి అధికారుల‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి బ‌స్సుల‌ను కొనుగోలు చేశామ‌ని, వాటిని నిరుప‌యోగంగా ఉంచ‌డం వ‌ల్ల ఆదాయం కొల్పోవాల్సి వ‌స్తుంద‌ని, స్పెష‌ల్ ప్యాకేజీలు, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించి, ఆదాయాన్ని పెంచుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా చేప‌ట్టిన సుమారు 84 ప‌నుల పురోగ‌తిపై ప్రాజెక్ట్ ల వారీగా స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన అనుమతులు మంజూరై, ఇంకా టెండ‌ర్ల ద‌శ‌లో ఉన్న‌, ప‌నులు ప్రారంభం కాని వాటిపై ఆరా తీశారు. నిర‌ర్ధ‌కంగా ఉన్న ప‌ర్యాట‌క స్థ‌లాల‌ను వినియోగంలోకి తెచ్చి ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునే మార్గాల‌ను అన్వేషించాల‌ని, దీనికి సంబంధించి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని చెప్పారు.

Next Story