ఫాలోవర్లను నిండా ముంచుతున్న సెలబ్రిటీలు.. క్లిక్ చేస్తే ఖతం!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-31 02:17:01  IST  )

ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ లలో రీల్స్ స్క్రోల్ చేసేటపుడు వచ్చే యాడ్స్ చూసి టెంప్ట్ అయితే.. మీ జేబుకు పక్కా చిల్లు పడటం ఖాయం.

ఫాలోవర్లను నిండా ముంచుతున్న సెలబ్రిటీలు.. క్లిక్ చేస్తే ఖతం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలు, డిస్కౌంట్ ఆఫర్లు, ఆరోగ్య చిట్కాలను చూసి వెంటనే టెంప్ట్ అవుతున్నారా?.. అలాగైతే కచ్చితంగా సైబర్ నేరగాళ్ల వలలో మీరు చిక్కుకున్నట్టే. నెట్టింట వచ్చే స్పాన్సర్డ్ యాడ్స్‌లో ఎక్కువ శాతం పచ్చి అబద్ధాలే. అవన్నీ ప్రజలను బురిడీ కొట్టించే నకిలీ ప్రకటనలే.. డబ్బుల కోసం సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జనాన్ని నిలువునా ముంచుతున్నారని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మోసాల యాడ్స్‌కు అడ్డా..

ప్రస్తుతం ఈ యాడ్స్ దందా అంతా డిజిటల్ రూపంలోకి మారడంతో ఫేక్ ప్రకటనలకు మెటా సంస్థ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన అడ్డాగా మారింది. డిజిటల్ మోసాల్లో అత్యధికంగా ఫేక్ ప్రచారాలు ఇక్కడే దర్శనమిస్తున్నాయి. ఇందులో యువత జీవితాలను నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనల వాటానే ఎక్కువ యాడ్స్ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవి చట్టవిరుద్ధమని తెలిసినా.. వందల కొద్దీ ప్రాక్సీ సైట్లను మారుస్తూ జనాన్ని జూదానికి బానిసలుగా చేస్తున్నారు.

కక్కుర్తితో ఫాలోవర్లను ముంచుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు..

సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు.. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ పేరుతో తమను గుడ్డిగా నమ్మే అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రకటనల్లో నిబంధనలు బ్రేక్ చేసినట్టు తెలిసింది. వీరిలో ఎక్కవ శాతం మంది బెట్టింగ్, మద్యం వంటి నిషేధిత ఉత్పత్తులను నిస్సిగ్గుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తూన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ బిఫోర్, ఆఫ్టర్ ఫోటోలను సృష్టించి సౌందర్య సాధనాలు, హెల్త్ ప్రొడక్ట్స్‌పై అశాస్త్రీయ వాగ్దానాలు చేస్తున్నారు. ఎలాంటి క్లినికల్ ఆధారాలు లేకుండానే డయాబెటిస్, లివర్ వ్యాధులను నయం చేస్తామంటూ.. కంప్లీట్ బ్రెయిన్ న్యూట్రిషన్ పేరిట తల్లిదండ్రుల ఆందోళలనలను ఆసరాగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్‌లోనూ అదే మాయాజాలం..

ఫేక్ ప్రకటనల మాయాజాలం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీగా కనిపిస్తోంది. ప్రాజెక్టులకు కనీస రెరా రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండానే.. కొనుగోలు కచ్చితంగా రెంటల్ ఇన్‌కమ్ వస్తుందంటూ అసత్యపు వాగ్దానాలతో రియల్టర్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ముందే క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఆరా తీయాలి. ఆన్‌లైన్ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

యాడ్స్‌ను గుడ్డిగా నమ్మొద్దు : వి. అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్

‘సైబర్ మోసాలకు చెక్ పెట్టడం పూర్తిగా పౌరుల చేతుల్లోనే ఉంది. సోషల్‌మీడియా సెలబ్రిటీలు చెప్పే మాటలను, వారు ప్రమోట్ చేసే యాడ్స్‌ను గుడ్డిగా నమ్మి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దు. సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం, ఆ సమాచారాన్ని తోటివారికి పంచడం ఎంతో ముఖ్యం. స్నేహితులతో కూర్చున్నప్పుడు కొత్త తరహా మోసాలపై తప్పనిసరిగా చర్చించండి. ముఖ్యంగా టెక్నాలజీపై అవగాహన లేని వృద్ధులకు సైబర్ నేరాల తీరును తరచూ వివరిస్తూ ఉండండి. మీ నిరంతర అప్రమత్తత, చైతన్యంతోనే ఈ ఆన్‌లైన్ ఫేక్ దందాలకు అడ్డుకట్ట వేయగలం.’

Next Story