- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు : టీజీపీఎస్సీ
గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవపట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవపట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో జరిగిన ప్రచారంపై కమిషన్ సీరియస్ గా స్పందించింది. కొంతమంది స్వార్థపరులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా సమాచారాన్ని విశ్లేషిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. ఇది గ్రూప్1 అభ్యర్థులలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతిభావంతులైన అభ్యర్థులను కమిషన్ తన నియమ నిబంధనలకు లోబడి ఎంపిక చేస్తుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్య వర్తులు తప్పుడు వాగ్దానాలు చేస్తే వారిపై అభ్యర్థులు వెంటనే సంబంధిత ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని , మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు, హామీలు ఇచ్చినట్లు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు రాలేదని తెలిపింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 మొయిన్స్ మార్కులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు, సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీజీపీఎస్సీ అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో . గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిందని, సమాధాన పత్రాల మూల్యాంకనం అదే సంవత్సరం నవంబర్ 1 న ప్రారంభమై 31 తో పూర్తయిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ఉత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేయడమే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీగా కమిషన్ లక్ష్యమని పేర్కొంది. అభ్యర్థుల సబ్జెక్టుల వారీగా మార్కులను వారి లాగిన్‌లో కమిషన్ ఉంచినట్లు తెలిపింది.
100, 500 ర్యాంకుల వరకు వివరాలు:
రిజర్వేషన్ రోస్టర్ల ప్రకారం నోటిఫై చేసిన ఖాళీల ఆధారంగా అభ్యర్థులను మెరిట్ జాబితా నుంచి ఎంపిక చేస్తారని తెలిపింది. ఆర్డీఓ, డీఎస్పీ, సీటీఓ లాంటి ప్రతి కేటగిరీ పోస్టులలో నోటిఫికేషన్ ప్రకారం రిజర్వ్ చేయని, రిజర్వ్ చేయబడిన కేటగిరి అభ్యర్థులు రిక్రూట్ మెంట్ అవుతారని తెలిపింది. మొదటి వంద ర్యాంకుల్లో అభ్యర్థుల వివరాలను బట్టి చూస్తే పురుషులు 59 మంది, మహిళలు 41 మంది , అలాగే కమ్యూనిటీ ప్రకారం ఓసీలు 32, బీసీలు 48, ఎస్సీలు 3, ఎస్టీలు 5 , ఓసీ ఈడబ్ల్యూఎస్ 12 మంది ఉన్నారని టీజీపీఎస్సీ తెలిపింది. అలాగే మొదటి 500 ర్యాంకుల వారిగా చూస్తే పురుషులు 296, మహిళలు 204 , కమ్యూనిటీల వారిగా చూస్తే ఓసీలు 132, బీసీలు 228, ఎస్సీలు 50, ఎస్టీలు 38, ఓసీ ఈడబ్ల్యూఎస్ 52 మంది ఉన్నట్లు పేర్కొంది.






