రోడ్డు మీద ‘క్లీన్ బౌల్డ్’ కావొద్దు.. యమధర్మరాజు దగ్గర ‘DRS’ ఉండదు! సజ్జనార్ హెచ్చరిక

by Ramesh Naini |

ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కానీ, ఆ అభిమానం ప్రాణాల మీదకు తెచ్చుకునే వెర్రి పిచ్చిగా మారకూడదని సీనియర్ పోలీస్ అధికారి వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

రోడ్డు మీద ‘క్లీన్ బౌల్డ్’ కావొద్దు.. యమధర్మరాజు దగ్గర ‘DRS’ ఉండదు! సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కానీ, ఆ అభిమానం ప్రాణాల మీదకు తెచ్చుకునే వెర్రి పిచ్చిగా మారకూడదని సీనియర్ పోలీస్ అధికారి వీసీ సజ్జనార్ హెచ్చరించారు. రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో బైక్ నడుపుతూ ఓ వ్యక్తి మొబైల్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న వీడియోను శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఆయన.. తనదైన శైలిలో క్రికెట్ పరిభాషను జోడించి యువతకు కనువిప్పు కలిగేలా సందేశం ఇచ్చారు.

యమధర్మరాజుకు డీఆర్ఎస్ (DRS) తెలియదు

‘మీరు చూసే ఐపీఎల్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ఉంటుందేమో... కానీ యమధర్మరాజు దగ్గర ‘డెత్ రివ్యూ సిస్టమ్’ మాత్రం అస్సలు ఉండదు!’ అని సెటైర్లు వేశారు. ‘గ్రౌండ్‌లో వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడు.. కానీ రోడ్డు మీద ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే మాత్రం పర్మనెంట్‌గా పైకి వెళ్తారు.’ అని హెచ్చరించారు. ‘క్రికెట్‌లో అంపైర్ నిర్ణయంపై రివ్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది.. ఇక్కడ ఆ ఛాన్స్, ఛాయిస్ రెండూ ఉండవు!’ అని చురకలు అంటించారు. ‘మొబైల్‌లో స్కోర్ బోర్డ్ చూస్తూ మీ జీవితాన్ని ‘జీరో’ కి క్లీన్ బౌల్డ్ చేసుకోకండి.’ అని సూచించారు. ‘మీకు మ్యాచ్ ముఖ్యం కావొచ్చు.. కానీ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే మీ కుటుంబానికి ‘మీరు’ మాత్రమే ముఖ్యం. క్రికెట్ పై అభిమానం ఉండొచ్చు కానీ, అది ప్రాణాలు తీసే వెర్రి పిచ్చి మాత్రం కాకూడదు. బి సేఫ్.. డ్రైవ్ సేఫ్!’ అని సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో, దానికి ఆయన జత చేసిన చురుకైన సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారికి ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story