రిజర్వేషన్లపై ప్రశ్నలొచ్చినా సిగ్గుపడొద్దు.. మన మూలాలపై గర్వపడాలి: సీతక్క

by Ramesh Naini |

విద్యార్థులు అత్యున్నత విద్యను అభ్యసించాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రపంచంతో పోటీ పడాలని మంత్రి సీతక్క సూచించారు.

రిజర్వేషన్లపై ప్రశ్నలొచ్చినా సిగ్గుపడొద్దు.. మన మూలాలపై గర్వపడాలి: సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు అత్యున్నత విద్యను అభ్యసించాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రపంచంతో పోటీ పడాలని మంత్రి సీతక్క సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, దేవుళ్లు, మూలాలను ఎప్పటికీ మరవకూడదన్నారు. భవిష్యత్తులో సామాజిక నేపథ్యంపై, రిజర్వేషన్లపై ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా.. మనం ఎవరో చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రాంభవన్ వేదికగా శనివారం జరిగిన 'గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలల సొసైటీ అకాడెమిక్ సక్సెస్ మీటింగ్'కు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరి జీవితంలో అయినా ఎప్పటికీ ఉండిపోయింది కేవలం విద్య మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని సాధారణ పాఠశాలలను అధిగమించి, అద్భుత ఉత్తీర్ణత శాతం సాధిస్తున్న గురుకుల విద్యార్థులను అభినందించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలవడం ఒక ఆదివాసీ బిడ్డగా ఎంతో గర్వపడుతున్నట్టు తెలిపారు. మహబూబాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వంటి గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలు ఉత్తమ ఫలితాలతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచినట్లు వెల్లడించారు.

నామూషీ ఎందుకు?

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు కావాలనుకునే వారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడాన్ని మాత్రం నామూషీగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపితే నామూషీ ఎందుకని ప్రశ్నించారు. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చామన్నారు. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం.. ఉన్నతంగా ఎదిగిన వారి విజయ రహస్యం 'చదువు' మాత్రమే అని తేలిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకే తొలి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రకటనల తరహాలోనే.. ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Next Story