హైకోర్టులో దానం, స్పీకర్‌కు చుక్కెదురు.. కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు

by Kema Shiva Kumar |

ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది.

హైకోర్టులో దానం, స్పీకర్‌కు చుక్కెదురు.. కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సభ్యత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అనంతరం, స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసులో స్పీకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చే వివరణపైనే అందరి దృష్టి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ కేసు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Next Story