ఆర్ఎంపీలే ప్రాణదాతలన్న పల్లా.. మండిపడుతున్న వైద్య సంఘాలు

by Ajay Maddhiboyina |

ఆర్ఎంపీలు గోల్డన్ అవర్ లో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు, వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షాత్తు ఆయనో ఎమ్మెల్యే అని... ఆయనకే మెడికల్ కాలేజీ కూడా ఉందని... ఆయన మెడికల్ కాలేజీలో డాక్టర్ల బదులుగా ఆర్ఎంపీలను తయారు చేస్తారా అంటూ వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్ఎంపీలే ప్రాణదాతలన్న పల్లా.. మండిపడుతున్న వైద్య సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎంపీలు గోల్డన్ అవర్ లో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు, వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షాత్తు ఆయనో ఎమ్మెల్యే అని... ఆయనకే మెడికల్ కాలేజీ కూడా ఉందని... ఆయన మెడికల్ కాలేజీలో డాక్టర్ల బదులుగా ఆర్ఎంపీలను తయారు చేస్తారా అంటూ వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఒక వ్యక్తి స్పెషలిస్ట్ డాక్టర్ కావడానికి ఎంబీబీఎస్, పీజీ చదివేందుకు సుమారు 8.5 నుంచి 9 ఏళ్లు పడుతుందని... కానీ అంతటి వైద్య విద్యను అపహాస్యం చేయడం ఎంత వరకు సమంజసమని వైద్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గుర్తింపు లేని వారు అందించే వైద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారెందరో ఉన్న నేపథ్యంలో ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మండిపడుతున్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునాలని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజారోగ్యంపై శాస్త్రీయ ఆధారాలు లేని వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎప్పుడూ చేయకూడదని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు.

గతంలో కవ్వంపల్లి...

గతంలో ఇదే తరహాలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సైతం వ్యవహరించారు. ఆర్ఎంపీలకు అనుకూలంగా మాట్లాడారు. ఆర్ఎంపీలను వేధిస్తున్నావంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు గత ఏడాది జులై 17న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. ఆర్ఎంపీలు, పీఎంపీలకు మద్దతుగా మాట్లాడిన నేపథ్యంలో హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్య కుమార్ ఎమ్మెల్యే కవ్వంపల్లికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పల్లా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు సైతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇవి ప్రమాదకరమైన వ్యాఖ్యలు...

- డా. కార్తీక్ నాగుల, హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత్యంత ప్రమాదకరమైనవి. ఆయన బాధ్యతారహితంగా, తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడటం ప్రజారోగ్యానికి పెనుముప్పు. అర్హత లేని వైద్యులను ప్రశంసించడం, వారు అందించే సేవలను గొప్పవని కీర్తించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గుర్తింపు లేకుండా వైద్యం చేసే వారు గోల్డెన్ అవర్ లో ప్రాణాలు కాపాడతారని చెప్పడం పూర్తిగా ఆనైతికం. రాజకీయ కారణాలతో చట్టవిరుద్ధమైన పనిని వైద్య సేవగా పేర్కొనడం శోచనీయం. అమెరికాలో ఫార్మసిస్టులు మందులు సూచిస్తే వైద్యులు ఇస్తారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు శుద్ధతప్పు అని... ఎక్కడైనా మందులు రాసేది డాక్టర్లే. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని సూచిస్తున్నాం. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని డిమాండ్ చేస్తున్నాం.

----

గోల్డెన్ అవర్ లో కాపాడేది ఆర్ఎంపీలే...

- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఆర్ఎంపీలు లేకుంటే వైద్యం అందించే వారే లేరు. వారిని అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఆర్ఎంపీలపై కేసులు పెట్టి వారి ప్రాక్టీస్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో ఏదైనా జబ్బు వస్తే ఆర్ఎంపీల వద్దకే పోతున్నారు. గోల్డెన్ అవర్ లో ప్రాణాలు కాపాడుతోందే వాళ్లు. వారి వద్ద మెడిసిన్స్ ఎందుకున్నాయని ఇబ్బంది పెడుతున్నారు. తన వద్ద కూడా అవసరానికి కొన్ని రకాల మందుల పెట్టుకుంటాను... అలా అరెస్టు చేయాల్సి వస్తే అందరినీ అరెస్టు చేయాలి. అమెరికాలో మందులు సూచించేంది ఫార్మసిస్టులే. ఇక్కడ ఏమైనా ఆ విధానం పాటిస్తున్నారా... పేదలకు అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు... ఇది సరికాదు. వారి సేవలకు సాయం చేయకున్నా ఫర్వాలేదు... కానీ అనవసరమైన కేసులు పెట్టి ఆగం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే ఆర్ఎంపీలతో కలిసి కలిసి పోరాటం చేస్తా.

(ఇటీవల మీడియాతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు)

Next Story