డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా ఉండాల్సిదే : ఎన్‌ఎంసీ ఆదేశాలు

by Muthe.Rajitha |

రోగులకు అర్థం కాకుండా ఇష్టానుసారంగా, గందరగోళంగా ప్రిస్క్రిప్షన్ రాసే వైద్యులకు ఇది హెచ్చరిక లాంటి వార్త.

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా ఉండాల్సిదే : ఎన్‌ఎంసీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోగులకు అర్థం కాకుండా ఇష్టానుసారంగా, గందరగోళంగా ప్రిస్క్రిప్షన్ రాసే వైద్యులకు ఇది హెచ్చరిక లాంటి వార్త. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల్లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా, చదవగలిగేలా ఉండే విధంగా పర్యవేక్షణ చేపట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఇందుకోసం ప్రతి మెడికల్ కాలేజీలో డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సబ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించింది.

హర్యానా హైకోర్టులో యోగేశ్ వర్సెస్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌ఎంసీ వెల్లడించింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా ఉండటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘ఆరోగ్య హక్కు’లో భాగమని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు మందుల పేర్లను జెనరిక్ పేర్లతో, స్పష్టంగా వీలైనంత వరకు క్యాపిటల్ అక్షరాల్లో రాయాల్సిందేనని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

ఈ మార్గదర్శకాలను మెడికల్ విద్యా పాఠ్యాంశాల్లో కూడా తప్పనిసరిగా చేర్చాలని సూచించింది. డీటీసీ కింద ఏర్పాటు చేసే సబ్ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షించడం, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం, దిద్దుబాటు చర్యలు సూచించడం, సమావేశాల మినిట్స్‌లో నమోదు చేయడం వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ వివరాలను ఎన్‌ఎంసీకి అందించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యం చేయకుండా అన్ని మెడికల్ కాలేజీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ డైరెక్టర్ సీకే రామస్వామి స్పష్టం చేశారు. కోడిగెలికినట్లుగా ప్రిస్క్రిప్షన్ రాసే కొందరు వైద్యులు... ఎన్ఎంసీ ఆదేశాలతోనైనా తమ వైఖరి మార్చుకొని స్పష్టంగా క్యాపిటల్ అక్షరాల్లో మందుల చీటి రాసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తారని ఆశిద్దాం.

Next Story