కేటీఆర్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలపై బీజేపీ నేత ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

కేటీఆర్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వంటి పార్టీల వైఖరితో రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, ఆ పార్టీ నాయకులు తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకులు ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం, అనుకూల మీడియా ద్వారా తమ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తప్పవని.. ఒకవేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పు చేసి ఉంటే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం మాత్రమేనని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. చట్టపరమైన హక్కుల ప్రకారం ఎవరైనా ముందస్తు బెయిల్ (Anticipatory Bail) తీసుకోవచ్చని, అది పారిపోవడం కాదని, చట్టంలో ఉన్న హక్కును వినియోగించుకోవడమేనని పేర్కొన్నారు.

ముందు బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతి అంశాలపై విచారణలు ప్రారంభమయ్యాక కోర్టులను ఆశ్రయించిన వారు, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై నేరాలు భారీగా జరిగాయని ఆరోపించారు. ఎన్సీఆర్‌బీ (NCRB) గణాంకాల ప్రకారం.. 2014లో తెలంగాణలో మహిళలపై నమోదైన కేసులు 14,147 ఉండగా, 2023 నాటికి అవి 23,679కి చేరాయని గుర్తుచేశారు. అంటే మహిళలపై నేరాలు సుమారు 67 శాతం పెరిగాయని, దీనికి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని ప్రశ్నించారు.

ఇంతటి దారుణ చరిత్ర బీఆర్ఎస్ ట్రాక్ రికార్డులో ఉన్నప్పుడు, ఇప్పుడు మహిళల హక్కులు, మైనర్ల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ఆనాటి ఘటనల సమయంలో కేసీఆర్ రాజీనామా చేశారా, లేక కేటీఆర్ బాధ్యత తీసుకున్నారా? ఎవరైనా నైతిక బాధ్యత వహించారా? అని నిలదీశారు. ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ కుటుంబ సభ్యులపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణల సమయంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం రాజీనామాలు చేయలేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తమ పార్టీపై అబద్ధపు ప్రచారం చేస్తూ అభాండాలు వేస్తున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిరస్కరించారని చెప్పారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేస్ వంటి అంశాల్లో ఇరుక్కుపోతామనే భయంతోనే కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత భారత్' లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోందని, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని ఆయన సూచించారు.

Next Story