అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దు: ఐఏఎస్ రాణి కుముదిని

by Satheesh |   (  Updated:2022-12-19 17:01:52  IST  )

చిన్నారుల రక్షణ, భద్రత మనందరి బాధ్యత అని.. పాఠశాలల్లో పిల్లల రక్షణకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్ పర్సన్ సీనియర్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని అన్నారు.

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దు: ఐఏఎస్ రాణి కుముదిని
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారుల రక్షణ, భద్రత మనందరి బాధ్యత అని.. పాఠశాలల్లో పిల్లల రక్షణకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్ పర్సన్ సీనియర్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్డీఆర్డీలో త్రిసభ్యకమిటీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి పటిష్ట మార్గదర్శకాలు రూపొందించడానికి విలువైన సలహాలు సూచనలు అందించవలసినదిగా కోరారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో టెక్నాలజీ వరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకు వారి భద్రతకు ముఖ్యమైన అంశంగా సంతరించుకుందని పేర్కొన్నారు. ఆ క్రమంలో వివిధ భాగస్వాములను సాధికారులను చేయడం ఒక ముఖ్యమైన భాగమని అన్నారు.

అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరగక ముందే మేలుకునేలా ఉండాలని, ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే చెప్పగలిగేలా టీచర్స్ చొరవ తీసుకోవాలని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. పిల్లల రక్షణ, భద్రత మన బాధ్యతగా భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు డిపార్టుమెంట్ సమన్వయంతో అందరూ భాగస్వాములు కావలసినదిగా కోరారు. షీ టీమ్ డీఐజీ సతి మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, పిల్లలు రిపోర్ట్ చేసిన వెంటనే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన మాట్లాడుతూ.. పిల్లల శ్రేయస్సు రక్షణ అనేది సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములై బాధ్యత వహించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ విద్యాశాఖాధికారులు, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు, తల్లిదండ్రులు, టీచర్స్, నల్సర్ యూనివర్సిటీ, ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story