KTR: కేసీఆర్ ఆల్రెడీ ఆదేశించారు.. మా వాదన బలంగా వినిపిస్తాం

by Gantepaka Srikanth |

జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న డీ లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR: కేసీఆర్ ఆల్రెడీ ఆదేశించారు.. మా వాదన బలంగా వినిపిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న డీ లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్‌ను ఆహ్వానించేందుకు డీఎంకే నేతలు హైదరాబాద్ వచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ, నీటి సరఫరా మంత్రి కేఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం రెండు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. డీ లిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది అని పిలుపునిచ్చారు. సమిష్టిగా పోరాడితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. భారత ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని అన్నారు.

1970-80 దశకంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్తగా వచ్చిన సెన్సెస్ ప్రకారం నిర్ణయిస్తామనడం అన్యాయమని, ఫలితంగా పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాలిన్ ఏర్పాటుచేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారని.. 22న జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్, తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. డీఎంకే బృందం మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని పార్టీలతో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

Next Story