పవర్‌పాయింట్ రాజకీయాలు.. పాలమూరుకు నీళ్లు మాత్రం రాలేదు! డీకే అరుణ విమర్శలు

by Ramesh Naini |

పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి మాజీ సీఎం కేసీఆర్‌కు గానీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి గానీ లేదని బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు.

పవర్‌పాయింట్ రాజకీయాలు.. పాలమూరుకు నీళ్లు మాత్రం రాలేదు! డీకే అరుణ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి మాజీ సీఎం కేసీఆర్‌కు గానీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి గానీ లేదని బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప పాలమూరు ప్రజల కోసం వారు చేసింది ఏమీ లేదని ఆమె మండిపడ్డారు. పాలమూరు రైతులతో ఈ ఇద్దరు నేతలు రాజకీయ ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. మాయమాటలతో మోసం చేసి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, తమ తప్పులను ఆయనపై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ రాజకీయ నాటకాల మధ్య పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి, రైతులను వలసల నుంచి రక్షించాలనే చిత్తశుద్ధి కేసీఆర్‌కూ రేవంత్ రెడ్డికి లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని, తాజాగా అసెంబ్లీలోనూ అదే విధంగా ప్రజెంటేషన్ చేశారని పేర్కొన్నారు. పాలమూరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన ఆమె, ఈ వ్యవహారంలో రెండు ప్రధాన పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు.

Next Story