- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ, శాసన మండలిలో గళం విప్పిన జిల్లా ప్రతినిధులు
అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశంలో జీరో అవర్‌లో జిల్లాకు చెందిన పలువురు ప్రతినిధులు గళం విప్పారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశంలో జీరో అవర్‌లో జిల్లాకు చెందిన పలువురు ప్రతినిధులు గళం విప్పారు. తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మాసబ్ చెరువు ఆక్రమణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సభలో ప్రస్తావించగా.. నాలా పనులను చేపట్టి ముంపు సమస్యను తీర్చాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అటు శాసన మండలిలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటు ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలను ఆలకించిన సంబంధిత ఆమాత్యులు సానుకూలతను తెలిపారు.
కబ్జాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలి : మల్ రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్క యంజాల్ ఉన్న మాసబ్ చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. గతంలో కొంత ఆక్రమణలను తొలగించినప్పటికీ కబ్జాలు నేటికీ కొనసాగుతున్నాయి. చెరువు కుచించుకు పోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ముంపు సమస్యను ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా అధికారులు కబ్జాలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశించాలి.
రెండో దశ నాలా పనులను మొదలు పెట్టాలి : సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే
మహేశ్వరం నియోజకవర్గంలో ఎస్ఎన్ డీపీ రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలి. జిల్లాలోని 27 మున్సిపాలిటీలలోనూ నాలా సమస్యలు ఉన్నాయి. భారీ వర్షాల సమయంలో వరద ముప్పుతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాకాలం రాకముందే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కొత్త మండలాలను ఏర్పాటు చేయాలి : నవీన్ కుమార్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ
చిన్న మండలాలతోనే అభివృద్ది, మౌలిక వసతులు సమకూరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని చేగూరు, చించోడు, మొగిలి గిద్ద లను మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం స్వయంగా శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు నిలిచి పోయాయి. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.






