Ration Shops: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ షురూ.. కానీ ఆ జిల్లాలో దొడ్డు బియ్యమే!

by Ramesh Naini |

తెలంగాణ వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ షురూ అయింది.

Ration Shops: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ షురూ.. కానీ ఆ జిల్లాలో దొడ్డు బియ్యమే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు (Ration card holders) సన్నబియ్యం పంపిణీ షురూ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం సంబరాల వాతావరణం నెలకొంది. ఇవాళ ఉదయం 8 నుంచే రేషన్‌ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో పంపిణీ కొనసాగిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ వేదికగా పేదలకు సన్నబియ్యం కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించిన విషయం తెలిసిందే. చాలా పకడ్బందీగా.. పేదలందరూ తినే విధంగా సన్నబియ్యం కార్యక్రమం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచిత సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు రూ.40 వరకు ఖర్చు చేసిందని, ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో రూ.1.90కే కిలో బియ్యం ఇవ్వాలని తొలుత కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి భావించారని, ఆ తర్వాత సర్కార్ మారడంతో ఎన్టీఆర్ ప్రభుత్వం రూ.2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

హైదారాబాద్‌లో దొడ్డు బియ్యం

ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. ఖైరతాబాద్ సర్కిల్-7 పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో 2,95,779 మంది కార్డుదారులకు తీవ్ర నిరాశే మిగిలినట్లైంది. నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ చేపట్టవద్దని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సర్కిల్-7 పరిధిలో ఏప్రిల్ నెల కోట కింద దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. సన్న బియ్యం బస్తాలు ఒక మూలన పెట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అన్ని రేషన్ షాపులు దొడ్డు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో మే నెల నుంచి పంపిణీ చేయనున్నారు.

Next Story